Tuesday, 22 April 2025

అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత…   ధారావాహిక-486.
4️⃣8️⃣6️⃣.(ఆఖరు భాగం)
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!

                      *భగవద్గీత*
                   
               (సరళమైన తెలుగులో)

*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*77. శ్లోకము:*

*”తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేఃl*
 *విస్మయో మే మహాన్ రాజన్! హృష్యామి చ పునః పునఃll”*

“ఓ ధృతరాష్ట్ర మహారాజా! నేను విన్న కృష్ణార్జున సంవాదంలో అత్యంత ముఖ్యమైనది విశ్వరూప సందర్శనము. అది ఒక అద్భుతమైన అనుభూతి. ఆ సన్నివేశాన్ని మరలా మరలా తలచుకుంటూ, తలచిందే మరలా తలచుకుంటూ, ఆశ్చర్యానుభూతికి, విస్మయానికి, సంతోషానికి లోనవుతున్నాను.
```
గీత అంతా ఒకటి. అందులో విశ్వరూప సందర్శనము పరమాద్భుతము, అద్భుతములో పరమాద్భుతము అని అంటున్నాడు సంజయుడు. కళ్లు మూసినా తెరిచినా అదే స్మరణకు వస్తుంది అంటున్నాడు సంజయుడు. తలచి తలచి పులకాంకితుడు అవుతున్నాడు. సంజయుని మనసంతా నిర్మలంగా ఉంది. అందుకే ఆనందంతో నిండి పోయింది. దివ్యమైన అనుభూతితో శరీరం ఆనందంలో ఓలలాడింది. ఇలా ఉంటుంది అని చెప్పలేని ఆనందం అది. ‘పునః పునః హృష్యామి చ’ అంటే మరలా మరలా తలచుకొని తలచుకొని ఆనందం పొందుతున్నాను అని సంజయుడు చెబుతున్నాడు.

మనం అందరం కూడా విశ్వరూపాన్ని దర్శించాము. మనకూ ఆ ఆనందం కలగాలి. కలగడం లేదూ అంటే మనం గీతను మనసారా ఆస్వాదించలేదు అని అర్ధం. అందుకే గీతను ఒకసారి వింటే చాలదు మరలా మరలా వినాలి. చదవాలి. అధ్యయనం చేయాలి. ఆ విషయమే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. సంజయుడికి కలిగిన ఆత్మానుభూతి సంజయుని ముఖతా గీతను విన్న దృతరాష్ట్రుడికి కలగలేదు. ఎందుకు అంటే సంజయుని మనసు నిర్మలంగా, నిష్కల్మషంగా ఉంది కాని ధృతరాష్ట్రుడికి సంసార బంధనములు, పుత్రవ్యామోహము, విపరీతమైన రాజ్యకాంక్ష, అతని మనసును కలుషితం చేసాయి. అవి ఓ పట్టాన పోవడం లేదు. అందుకే సంజయునికి కలిగిన అనుభూతి ధృతరాష్ట్రునికి కలగలేదు కలిగి ఉంటే వ్యాసుడు చెప్పి ఉండేవాడు.```


*78. వ శ్లోకము:*

*”యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరఃl*
 *తత్ర శ్రీర్విజయో భూతి ర్ధ్రువా నీతిర్మతిర్మమll”*

“ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో, అక్కడ విజయము, శ్రేయస్సు, సంపదలు, ఐశ్వర్యము, వాటితో పాటు ధర్మము, నీతి, ధృఢంగా, స్థిరంగా ఉంటాయని 
నా అభిప్రాయము అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు.
```
‘దీని అర్థం, కృష్ణార్జునులు పాండవుల పక్షంలో ఉన్నారు. ఆ కారణం చేత పాండవులు ఈ యుద్ధంలో విజయం సాధిస్తారు. వారికి రాజ్యము, రాజ్యసంపదలు, శ్రేయస్సు కలుగుతాయి. వారి వెంటే ధర్మము, నీతి ఉంటాయి. ఇది నా అభిప్రాయము అని సంజయుడు యుద్ధపరిణామాలను ముందే ఊహించి చెప్పాడు. 
దీనికి బాహ్యమైన కారణం కూడా ఉంది. కౌరవ పక్షాన వారికి వెన్నుదన్ను అయిన భీష్ములవారు పది రోజుల యుద్ధం చేసి పడిపోయారు. దానితో పాండవులు సగం విజయం సాధించినట్టు, మిగిలిన సగం విజయం పాండవుల స్వంతం అవుతుంది. ఎందుకంటే ధర్మం, యోగీశ్వరుడు అయిన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు వారి పక్షాన ఉన్నారు. నీ కొడుకులు ఈ యుద్ధంలో గెలుస్తారు అన్నది ఒట్టి మాట. ఇంత వరకు నీవు నీ కుమారుడు సుయోధనుడు యుద్ధంలో గెలుస్తాడు రాజ్యాధికారం పొందుతాడు చక్రవర్తి అవుతాడు అనే అపోహలో ఉన్నావు. అది నిజం కాదు. అలా ఎన్నటికీ జరగదు. నీ కుమారులు అధర్మపరులు కాబట్టి ఈ యుధ్ధంలో వారికి పరాజయము కలగక తప్పదు. ధర్మరాజు చక్రవర్తి కావడం తథ్యం. ఇది సంజయుల వారి ఆఖరి మాటలు.

ఇది గీతలో ఆఖరు శ్లోకము, అద్భుతమైన శ్లోకము, అర్థవంతమైన శ్లోకము. అర్జునుడు ధనుస్సు ధరించి ఉన్నాడు. కృష్ణుడు యోగీశ్వరుడు. యోగులకు ఈశ్వరుడు యోగమును అభ్యసించిన వాడు. యోగమునే ఆయుధముగా కలవాడు. ధనుస్సుతో బయట ఉండే శత్రువులను నాశనం చేయవచ్చు. కాని యోగముతో అంతఃశ్శత్రువులను చంపవచ్చు. ఆ ఆయుధము కృష్ణుని వద్ద ఉంది. బాహ్య శత్రువులను నాశనం చేసే ఆయుధం ధనుస్సు అయితే, అంతఃశ్శత్రువులను చంపే ఆయుధం యోగము. ఈ రెండు ఒకచోట ఉంటే కలిగే ఫలితం ‘తత్ర శ్రీ విజయోభూతి’ అక్కడ విజయం, ఐశ్వర్యము, సంపద లభిస్తుంది. అంటే బాహ్యశత్రువులు, అంతఃశ్శత్రువులు నశిస్తే మోక్షము, పరమ శాంతి అనే విజయం ఐశ్వర్యము లభిస్తుంది. కాబట్టి కృష్ణార్జునులు ఉన్న చోట బాహ్యవిజయము అంతర్విజయము తప్పకుండా లభిస్తాయి. అనంత ఐశ్వర్యములు లభిస్తాయి. పరమ శాంతి సుఖము లభిస్తాయి.

ఇక్కడ ‘యత్ర యత్’ర అని వాడారు అంటే ఎక్కడైతే అని అర్థం. ఎక్కడ అనే దానికి సమాధానం సగుణారాధన. పూజామందిరంలో పటం పెట్టుకోవడం వాటికి భక్తి శ్రద్ధలతో పూజాదికాలు నిర్వర్తించడం. బాహ్యంగా కృష్ణార్జునులను వారి ప్రతిమలను పూజిస్తుంటే ఆ ప్రదేశంలో పవిత్రత శాంతి నెలకొంటాయి. వాటితోపాటు, ప్రతి మానవుని మనస్సులో అర్జునుడు, కృష్ణుడు ప్రతిష్టింపబడాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి వాడికి సంతోషం కావాలి, విజయం కావాలి, శాంతి కావాలి. ఇవన్నీ లభించాలంటే, ముందు మనలో ఉన్న దుర్మార్గపు ఆలోచనలు నశించాలి. మనలో ఉన్న అంతఃశ్శత్రువులు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) నశిస్తే కానీ సాధ్యం కాదు. దానికి ఆయుధం కావాలి. లోపల ఉన్న శత్రువులను జయించాలంటే యోగము అనే ఆయుధం కావాలి. దానికి అధిపతి కృష్ణుడు ఆయన యోగీశ్వరేశ్వరుడు. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉంటుంది. అర్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అధర్మం నాశనం అవుతుంది. కాబట్టి కృష్ణార్జునులు ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఐశ్వర్యం, సుఖము, శాంతి లభిస్తుంది.

కృష్ణుడు జ్ఞాన యోగమునకు ప్రతీక. అందుకే యోగీశ్వరుడు అని అన్నారు వ్యాసుల వారు. అర్జునుడు కర్మయోగానికి ప్రతీక. అందుకే ‘ధనుర్ధరః’ అని అన్నారు. ముందు కర్మయోగము ఆచరించి, దాని ద్వారా జ్ఞానమును సంపాదించాలి. ఆత్మజ్ఞానము పొందాలి. దీని పరిణామము ‘ధ్రువా నీతి’ అంటే నీతి ధృవంగా వర్ధిల్లుతుంది. పరమ శాంతి కలుగుతుంది. కాబట్టి అందరూ కృష్ణార్జునులను పూజాగృహములోనే కాదు, మనసులో కూడా నిలుపుకొని గీతను ప్రతి నిత్యమూ అధ్యయనం చేసి, స్మరించుకుంటూ, మననం చేసుకుంటూ ఆచరిస్తే, వారికి అనంత ఐశ్వర్యం, పరమశాంతి లభిస్తాయి అని గీతాసారము. 
దీనితో భగవద్గీత సంపూర్ణము.

శ్రీ మహాభారతం మధ్యలో ఆణిముత్యంలా భాసిల్లుతున్న,
ఉపనిషత్తుల సారమైన బ్రహ్మ విద్య, యోగశాస్త్రము,
శ్రీ కృష్ణార్జున సంవాద రూపంలో మనకు వ్యాసుల వారు అందించిన
భగవద్గీతలో, మోక్షసన్యాస యోగము అను పదునెనిమిదవ అధ్యాయము సంపూర్ణము.

ఇంతటితో భగవద్గీత సర్వం సంపూర్ణము.
ఓంతత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్
```
*శాంతి మంత్రము:*

ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు।
ఓం సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు॥

సర్వేభవంతు సుఖినః సర్వేసంతు నిరామయాః।
సర్వేభద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దుఃఖభాగ్భవేత్॥

ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ
ఓం మృత్యోర్మా అమృతం గమయ.

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే

ఓం సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మా విద్విషావహై
     ఓం శాంతిః శాంతిః శాంతిః 
```
శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహంతో నాచే నిర్వహించబడిన ఈ గీతాజ్ఞానయజ్ఞంలో
నిరంతరం నా వెంట ఉండి నన్ను నడిపించిన..
భక్తి పేజెస్ అధినేత శ్రీ కె.వి. రాఘవరావు గారికి
నా మనః పూర్వక ప్రణామాలు అర్పించుకుంటున్నాను.✍️
         -మీ విధేయుడు
      యం.వి.సుబ్రహ్మణ్యం.```

*ఓంతత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.* 
(సమాప్తం)

   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
   (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment