శ్రీమద్రామాయణము.
(257 వ ఎపిసోడ్),
"" లోకప్రవాదస్సత్యో~యం పండితైస్సముదాహృతః,,
అకాలే దుర్లభో మృత్యుః స్ర్తియా వా పురుషస్య వా ||
స్ర్తీ పురుషులలో ఎవ్వరికైనను తాము ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణించ వచ్చనే భావన యుండుట సహజము.కానీ ఎటువంటి పరిస్థితులలో అలా వారు కోరుకుకున్నప్పుడు మరణము సంభవింపదనేది నిజము.అదే ప్రాజ్ఞుల నిర్ణయము.
రామాయణము సుందరకాండములో సీతామాత తాను చేసిన ప్రారబ్ధకర్మల ఫలితాల వల్ల తనకు మిక్కిలి దారుణమైన పరిస్థితులు ఏర్పడినవని దుఃఖిస్తు,
"" జీవితం త్యక్తుమిచ్ఛామి శోకేన మహతా వృతా,
రాక్షసీభిశ్చ రక్ష్యంత్యా రామో నాసాద్యతే మయా||,(25-19),
ఈ అశోకవనములో ఈ రాక్షస స్ర్తీల మధ్యయున్న నేను రాముని చేరజాలను. ఇలా అంతులేని శోకములో జీవించి యుండుటకంటే ఇక నా జీవనాన్ని చాలించుటయే యుక్తమైన విషయమని నిర్ణయించుకుంటుంది.
"" అంతకు మునుపే మన హనుమంతుల వారు కూడ ఈ విధముగనే భావన చేసి దేహత్యాగామునకు ఆలోచన చేసారు.
"సాగరనూపజే దేశే బహుమూలఫలోదకే,
చితాం కృత్వా ప్రవేక్ష్యామి సమిద్దమరణీసుతమ్"(13-41),
సీతామాత జాడ కనిపెట్టలేని నేను జీవించిన అనేక అనర్థములేర్పడగలవని ఊహించి, ప్రాయోపవేశమును బూని గానీ యోగసాధన ద్వారా గానీ ఈ శరీర సంబంధములను త్యజించి ప్రాణములను వదిలెదను.అప్పుడు కాకులు,వ్యాఘ్రములు నా శరీరాన్ని భక్షించగలవని ఆత్మహత్యా సంకల్పము చేస్తారు.జానకిని దర్శించలేకపోతే జలసమాధి ద్వార మహర్హులు అంగీకరించిన దేహత్యాగ మార్గాన్ని ఆశ్రయించి అసువులు వీడాలనే భావన చేస్తారు.
ఇలా ఆలోచించిన సీతామాతగానీ అంతకుమునుపు హనుమ గానీ వారనుకున్నట్లు జీవితాన్ని చాలించాలనుకున్నా వారిద్దరిలో ఏ ఒక్కరు ప్రాణత్యాగము చేయలేక పోయారు.
ఆంజనేయులవారు "'వినాశే బహనో దోషా జీవన్ భద్రాణి పశ్యతి" ప్రాణత్యాగమువలన ఉపయోగములు శూన్యము.బ్రతికియున్న ఏనాటికైనను అనుకున్నది సాధించవచ్చని ప్రాణాలను నిలుపుకున్నారు.మరి సీతామాత,
"" ధిగస్తు ఖలు మానుష్యం ధిగస్తు పరవశ్యతామ్,
న శక్యం యత్ పరిత్యక్తుమ్ ఆత్మచ్ఛందేన జీవితమ్"",(26-20),
నేను ఆత్మహత్య చేసుకొనుట అవివేకము ఈ నా జీవితము రాముని ఆధీనము.దీనిని త్యజించుటకు నాకు అధికారము లేదని భావించి "మనుష్యత్వము పాపపుణ్య విచక్షణ చేయాల"ని భావన చేసి ఆత్మహత్య అనే తలంపును విరమించుకుంటుంది.
కనుక స్ర్తీలైనా పురుషులైన వారు భావించిన విధముగ తాము కోరుకోగానే ప్రాణములను విడువలేరనే ప్రాజ్ఞుల మాట సత్యదూరము గాని విషయమని రామాయణము మనకి తెలియచేస్తున్నది.
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
No comments:
Post a Comment