*✍🏼 నేటి కథ ✍🏼*
*🐒కోతి దెబ్బ*
*పునఃకథనం: డా॥ ఎం. హరికిషన్ - 9441032212*
ఒక అడవిలో ఒక దొంగనక్క వుండేది. అది చిన్న చిన్న జంతువులు కనబడితే
చాలు వెంటబడి చంపి తినేది. దాంతో అడవిలో జంతువులు ఆహారం కోసం బయటికి
రావడానికి కూడా భయపడేవి. ఎప్పుడు ఎక్కడినుంచి వచ్చి మీద పడుతుందో అని
వణికిపోయేవి.
ఆ అడవిలో ఒక కోతి వుండేది. ఆ కోతి చాలా అల్లరిది. తెలివైంది. అందరినీ
మోసం చేసే ఆనక్కను ఎలాగైనా దెబ్బతీసి అడవిలోని జంతువులను కాపాడాలి అనుకుంది.
కోతి ఒక రోజు నక్క దగ్గరకు పోయి “నక్క మామా.. నక్కమామా... నువ్వు
ఎప్పుడయినా గుర్రం తొడ తిన్నావా... దానంత రుచి దేనికీ వుండదంట కదా! అడవిలో
చాలా జంతువులు చెప్పుకుంటున్నాయి” అని అడిగింది. ఆ మాట వింటూనే నక్కకు
నోరూరింది. “నిజమే అల్లుడూ... నేనూ విన్నాను. కానీ గుర్రాన్ని పట్టుకోవడం అంత
సులభం కాదు కదా... అది మెరుపువేగంతో పరుగెత్తుతుంది” అనింది.
కోతి చిన్నగా నవ్వుతూ “ నా దగ్గర ఒక ఉపాయం వుంది మామా... నువ్వు పోయి
నీ తోకకు, దాని తోకకు ఊడిపోకుండా గట్టిగా ముందు ముడివేసుకొని... ఆతరువాత
దాని తొడ పట్టుకో. అప్పుడు అది లేచి ఉరికినా నీ తోక దాంతో పాటే వుంటుంది కాబట్టి
నీవూ దాంతో పాటే వేగంగా ముందుకు పోతావు. అప్పుడు అది నీనుంచి తప్పించుకోలేదు.
చంపి తినొచ్చు' అనింది. నక్క ఈ ఉపాయం బాగుందని సరే అని తలూపింది.
అంతలో కోతి ' మామా మర్రి చెట్టు కింద ఒక గుర్రం పడుకుంది. మౌనంగా
పోయి అది లేవక ముందే చప్పుడు కాకుండా నేను చెప్పినట్టు చేయి' అని చెప్పింది.
నక్క అలాగేనంటూ అడుగులో అడుగు వేసుకుంటూ పోయి గుర్రం తోకకు, తన
తోకను గట్టిగా ముడి వేసుకొంది. తరువాత కసుక్కున దాని తొడ కొరికింది.
అంతే... ఆ నొప్పికి గుర్రం అదిరిపడి లేచింది. తప్పించుకోడానికి ఒక్కసారిగా
విదిలించుకొని ముందుకు ఉరికింది. ఆ వేగానికి నక్క పట్టు తప్పి కింద పడిపోయింది.
గుర్రం ఆగకుండా దానిని అలాగే రాళ్ళూ, రప్పల మీద లాక్కుంటూ వేగంగా పోసాగింది.
దాంతో ఆ నక్కకు బాగా దెబ్బలు తగిలి చనిపోయింది అడవికి పట్టిన పీడ వదిలి పోయింది. విషయం
తెలిసి చిన్న చిన్న జంతువులన్నీ సంబరంగా కోతిని మెచ్చుకున్నాయి.
No comments:
Post a Comment