Thursday, 26 March 2026

 *లోహ జంఘుని కథ*
(*కథా సరిత్సాగరము*)

కృష్ణుడు జన్మించిన మధురా నగరమందు 'రూపణిక' అను ఒక వేశ్య కలదు. 

ఆమె తల్లి 'మకరదంష్ట్ర'. 

ఒకనాడు ఆ వేశ్య దేవాలయము నందు 'లోహ జంఘు'డను బ్రాహ్మణుని సౌందర్యము చూచి మోహితురాలై అతనిని తన ఇంటికి పిలిచి అతనితో సరససల్లాపములు సాగించెను.

కాలక్రమమున అతడు ఆ ఇంటి యందే నివసించడం చూచి 'మకరదంష్ట్ర'కు ఒళ్లుమండి కుమార్తెతో ఇలా అన్నది.

'అమ్మాయీ! ఎందుకే ఈ డబ్బులేని పురుషుని సేవించుచున్నావు. 

సజ్జనులు శవమును ముట్టరు, వేశ్యలు దరిద్రుని తాకరు. 

అనురాగమెక్కడ? వేశ్యాత్వమెక్కడ? 

కావున ఈ నిర్ధనుని వదలివేయుము'- ఆ మాటలు విని రూపణిక కోపించి - అమ్మా! నీవట్లు మాట్లాడకు. నాకీతడు ప్రాణముల కంటే ప్రియుడు. నాకు ధనమధికముగా గలదు. వేరే ధనమేల? అని బదులు చెప్పినది'.

మకరదంష్ట్ర మారుమాట్లాడక లోహజంఘుని వెడల గొట్టుటకై తగిన ఉపాయము వెతుకుచుండెను. 

కొంతకాలము తరువాత ఒక రాజపురుషుని ఆశ్రయించి అతని సైన్య సహాయముచే రూపణిక ఇంట లేని అదను చూచి లోహజంఘుని గృహము నుండి వెడల గొట్టించినది. రూపణిక ఇంటికి వచ్చి దుఃఖముచే మంచము పట్టినది.

లోహజంఘుడు చేయునది లేక దేశ దిమ్మరిగా తిరుగుచూ ఒక చోట ఏనుగు కళేబరము చూచెను. దాని శరీరమంతయూ నక్కలు డొల్ల చేసినవి. అతడు జఘన మార్గమున లోపలికి ప్రవేశించి బడలికచే అచటనే నిద్రించెను. అంతలో కుంభవృష్టి కురియుట మొదలు పెట్టినది. ఆ వానకు ఏనుగు చర్మము సందులేకుండా మూసుకు పోయినది. జలప్రవాహము వచ్చి గజచర్మమును తీసుకొని ఒక నదిలో పడవైచెను.

అపుడు ఒక గరుడపక్షి ఆ ఏనుగును సముద్రమందున్న ఒక లంకకు ఎత్తుకు వెళ్ళి దానిని చీల్చగా లోపలనున్న 'లోహజంఘుని' చూచి ఎగిరి పోయినది. 

అతడు బయటకు వచ్చి చూడగా ఇద్దరు రాక్షసులు సముద్రము దాటి ఇతడు ఎట్లు వచ్చెనో అని భయపడి అతనిని తీసుకుని రాజైన విభీషణుని వద్దకు తీసుకువెళ్ళిరి. 

విభీషణుడు మానవులందు ఆదరము గలవాడగుటచే అతనిని గౌరవించి వివరము లడిగెను. అంత లోహ జంఘుడు తెలివిగా ఇట్లు బదులు చెప్పెను.

"నేను లోహ జంఘుడను బ్రాహ్మణుడను, మధురయందు విష్ణువు గూర్చి తపస్సు చేసితిని 

అపుడు శ్రీమన్నారాయణుడు నాకు కలలో కనబడి 'విభీషణుని వద్దకు వెళ్లుము. అతడు నా భక్తుడు, నీ దరిద్ర బాధ తీర్చగలడని చెప్పగా, 'నేనెక్కడ? విభీషణుడెక్కడ? అని నేనంటిని. 

కాని అంతలోనే మేల్కొని చూడగా సముద్రమందున్న ఈ లంకలో నుంటిని అంతకంటే నేనేమీ ఎరుగను"- అని చెప్పెను.

ఈ మాటలు విని లంక ఇతరులు ప్రవేశింప శక్యము కానిదగుటచే ఇది నిజముగా దేవతా మహిమయని విభీషణుడు తలచెను. 

పిమ్మట లోహజంఘునకు బహుధనమిచ్చి, 'స్వర్ణమూల'మను పర్వతమునకు రాక్షసులను పంపి ఒక గరుడపక్షి పిల్లను తెప్పించి లోహజంఘనకు మచ్చిక చేసుకొనుటకు ఇచ్చెను. 

కొంతకాలము పిమ్మట మధురకు వెళ్ళుటకు అనుమతిని కోరగా విభీషణుడు లోహజంఘునకు అమూల్యమైన రత్నములనిచ్చి, మధురవాసియగు హరికిమ్మని బంగారపు శంఖచక్ర గదాదుల నిచ్చెను.

అవి తీసుకుని గరుడపక్షి నెక్కి లంక నుండి బయలుదేరి సముద్ర మును దాటి మధురను చేరెను. 

నగరము బయట ఒక శూన్యాలయమున రత్నములను దాచి, పక్షిని ఒక చెట్టుకు కట్టి ఒక రత్నమును అంగడిలో అమ్మి వస్త్రములను, ఆహారమును తీసుకొని శూన్యాలయము చేరి పక్షికి ఆహారము పెట్టి తన్ను తాను విష్ణుమూర్తి వలె అలంకరించుకొని శంఖ చక్రములు ధరించి పక్షి నెక్కి రాత్రి కాగానే 'రూపణిక' సౌధమును చేరి ఆమెను పిలచి - నేను విష్ణువును నీ కోసము వచ్చితిని - అని పలుకగా, ఆమె నమస్కరించి దేవా! నన్ననుగ్రహింపుము' అని ఆదరించినది. 

ఆమెతో కొంతసేపు సుఖము ననుభవించి, వెనువెంటనే పక్షినెక్కి ఆకాశవీధిలో ఎగిరిపోయెను.

ఉదయముననే రూపణిక 'నేను విష్ణుభార్యను మానవులతో మాట్లాడను' అని మౌనము పూనినది. 

తల్లి మకరదంష్ట్ర లాలించి వివరము లడుగగా రూపణిక ఇద్దరి మధ్య ఒక తెర గట్టించి రాత్రి జరిగిన వృత్తాంత మును తల్లికి చెప్పినది. 

ఆరోజు రాత్రి మరల యధాపూర్వము వలె పక్షిపై వచ్చిన శంఖచక్రధారిని చూచి మకరదంష్ట్ర అది నిజమేనని నిశ్చయించు కొన్నది. 

మరునాడు ఉదయమున వేశ్యమాత రూపణికతో - అమ్మా! దైవా నుగ్రహము వలన నీవు దేవివైతివి. నేను నీకు తల్లిని కనుక దయచేసి నాకు బొందితో స్వర్గము చేరునట్లు స్వామి వారిని వేడుకొనమని బ్రతిమిలాడినది. 

రూపణిక సరేనని ఆనాటి రాత్రి మరల వచ్చిన లోహజంఘునితో ఈ విషయము చెప్పినది. దేవ వేషమందున్న లోహజంఘుడు ప్రియురాలితో ఇట్లనెను.

'నీ తల్లి పాపాత్మురాలు. ఇలాగే తీసుకువెళ్లుటకు వీలులేదు. ఏకాదశినాడు స్వర్గము తెరిచెదరు. ముందుగా శంకరుని ప్రమథ గణములు ప్రవేశించెదరు. 

వారి వేషము నీ తల్లికి వేసినచో వారితో పాటు లోనికి వెళ్ల గలదు. కావున ఆమె తల గొరిగించి మెడలో ఎముకల మాల, కాటుక పూసిన శరీరముతో దిగంబరిగా చేయుము అని చెప్పెను.

మరునాడు ఆ విషయము తల్లికి చెప్పగా సరే యని అంగీకరించి ఆ వేషము వేసినది. 

ఆ రాత్రి లోహజంఘుడు పక్షినెక్కి వచ్చి వికార వేషముతో దిగంబరిగా నున్న ఆమెను తీసుకుని ఆకసమున కెగసి ఆమెను ఒంటి స్తంభముగల శిఖరముపై నుంచెను. 

నేను మరలా వచ్చెదనని ఆమెకు చెప్పి, నగరమునందు జాగరణ చేయు భక్తులను చూచి - ప్రజలారా జన సంహారము చేయుటకు మహమ్మారి స్తంభ శిఖరమున ఉన్నది. అందరూ హరిభజన చేయుడని హెచ్చరించెను. ఆకసము నందుండి వచ్చిన ఇతని మాటలు నమ్మి ప్రజలు ఆందోళన చెందసాగిరి,

లోహజంఘుడు తన వేషము తీసివేసి, జన మధ్యమున నుండి ఈ విచిత్రమును చూచుచుండెను. 

స్తంభముపై నున్న మకరదంష్ట్ర, దేవుడు ఇంకనూ రాలేదామా యని విచారించుచుండెను. 

కింద జనుల కల్లోలమును విని అయ్యో! అయ్యో! పడుచున్నాను, పడుచున్నాను' అని హాహాకార మొనర్చెను. 

మధురావాసులందరూ అదిగో నిజముగానే మహమ్మారి పడుచున్నదని - దేవీ! పడవద్దు -ఛ వద్దు అనుచూ బిగ్గరగా అరిచిరి.

ఆ రాత్రి ఎట్లో గడచినది. ఉదయముననే స్తంభముపైనున్న వేశ్యమాతను చూచి గుర్తు పట్టి అందరూ భయము పోగా నవ్వసాగిరి.

ఈ వృత్తాంతము తెలిసి రూపణిక వచ్చి, ఆమెను దింపించి, జరిగినది వివరించినది. 

ఇది కాముకులను మోసగించినందుకు ఎవడో తగిన శాస్తే చేసినాడని, అతనిని తప్పక సత్కరించవలెనని అందరూ భావించగా, లోహ జంఘుడు తాను చేసిన దానిని ప్రజలందరికీ చెప్పి, విభీషణుడిచ్చిన శంఖ చక్ర గదాదులను శ్రీహరికి సమర్పించెను. 

అపుడు మధురావాసు లందరూ సంతసించిరి. 

రాజాజ్ఞచే రూపణికను పొంది వేశ్యమాతకు ప్రతీకారము చేసి సుఖముగా నుండెను. 

******     *****   *****

No comments:

Post a Comment