నాయనమ్మ - ఉప్పుడుపిండి
"నాయనమ్మ! ఓ నాయనమ్మ!"అంటూ వచ్చారు మనవళ్లు మనవరాళ్లు.
అక్కడే ఉన్న తల్లి అంజలి..
"నాయనమ్మ పెరట్లో ఉంది. రాగానే నాయనమ్మ నాయనమ్మ అంటూ అరుస్తారు ముందు మీరు కాళ్లు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకోండి"అన్నది అంజలి.
"ముందు నాయనమ్మని చూడాలి మా కోసం ఏం చేయలేదా?"అంటూ పెరట్లోకి పరిగెత్తారు.
పెరట్లో నాయనమ్మ ఏదో వంటకం ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించింది.
"ఇక్కడున్నావా? మా కోసం ఇంకా ఏం తయారు చేయలేదా?"అన్నారు పిల్లలు.
"చేస్తున్నాను రా వీలైతే ముందు బట్టలు మార్చుకోండి! బడి నుండి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకోవాలనే సోయి కూడా లేదు మీకు! పోండి ముందు"అంటూ గట్టిగా అరిచింది నాయనమ్మ.
"ఈ ముసలి దాని దగ్గరికి మనం ఎంతో ప్రేమతో వస్తామా ఎలా కసరించుకుంటుందో చూడు"అన్నది శ్రీవల్లి.
"ఏంటి నానమ్మను అట్లా అనవచ్చా మనకోసమే కదా కష్ట పడుతుంది"అన్నది రమణి.
అన్నలు రఘు మరియు రాము ఏమి మాట్లాడకుండా బావి దగ్గరికి వెళ్ళిపోయారు.
గంగాళంలో ఉన్న నీళ్లతో కాళ్లు చేతులు కడుక్కొని లోపలికి వెళ్లారు. శ్రీవల్లి రమణి కూడా వారిని అనుసరించారు.
బయట స్నేహితులు పిలవడంతో నలుగురు ఆడుకోవడానికి వెళ్లారు. పెద్ద సుశాల భవంతి దాని పక్కన పెద్ద గుడి ఆ గుడి ముందు బోలెడంత స్థలం. ఆ స్థలంలో దాదాపు 15 మంది పిల్లలు ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
వీళ్ళ ఇంటికి వీధికి ప్రహరీ గోడ చిన్నగా ఉంది. కాస్త ఎక్కి చూస్తే పెరడంతా కనిపిస్తుంది. పిల్లలంతా ఆడుతున్నట్లే ఆడుతూ మధ్య మధ్యలో ఆ గోడ పైనుండి నాయనమ్మ ఏం చేస్తుందో చూస్తున్నారు.
కాసేపట్లో పెరట్లో నుండి గుమగుమ వాసనలు వచ్చాయి. ఇక ఆగలేని పిల్లలంతా దొడ్డిదారి గుండా పెరట్లోకి పరిగెత్తారు.
అప్పటిదాకా శ్రీవల్లి రమణి నాయనమ్మ మీద ఉన్న అలక ఆ కమ్మని వాసన చూడగానే పోయింది.
వీరితో పాటే వీరు స్నేహితులంతా కూడా వీరిని అనుసరించారు అది అలవాటే.
"నాయనమ్మ ఏం చేసావే?"అని అడిగింది శ్రీవల్లి.
"ఉప్పుడు పిండి. చెప్పేదాకా కూడా ఆగరు. కోపంతో పరిగెత్తారు కదా"అన్నది.
పిల్లలంతా నాయనమ్మని చూస్తూ అలాగే నిలబడ్డారు.
తుత్తురు చెట్టు కింద
పెద్ద ఇత్తడి గిన్నె కట్టెల పొయ్యి మీద పెట్టి దానిలో గరిట పెట్టి కలుపుతూ నిలబడింది. చేతులు కాలకుండా తుత్తురు ఆకులను పట్టుకుంది.
"నాయనమ్మ కాలుతుందే ఏదైనా బట్ట పట్టుకోవచ్చు కదా" అన్నాడు రఘు.
"అంత శానిగా నేనేం లేను. అవన్నీ మీ అమ్మకే కావాలి"అంటూ ఒక్క దీర్ఘం తీసింది నాయనమ్మ.
"ఇప్పుడు నాయనమ్మని ఏమి మాట్లాడించవద్దు ముందు మనం ఇప్పుడు పిండి తిందాం"అన్నాడు రాము.
"ఇంకా నన్నేం చూస్తున్నారు. వెళ్లి ఆ సత్యనారాయణ కోసి గంగాళంలో నీళ్లతోనే కడుక్కొని రండి"అంటూ ఒక్క అరుపు అరిచింది.
అందరూ వెళ్లి ముందుగా చేతులు సబ్బుతో కడుక్కొని ఆకులను కోసి నీళ్లతో కడిగి తులసి చెట్టు చుట్టూ ఉన్న గట్టు మీద కూర్చున్నారు.
నాయనమ్మ వయసు దాదాపు 90 ఏళ్లు. నడుమంతా వంగిపోయి శరీరం బక్క చిక్కిపోయి ఉంది. కానీ ముఖంలో ఆ ధైర్యం ఏమాత్రం సడల లేదు. పెద్ద కళ్ళు అలా చూసిందంటే చాలు ఎంతటి వాళ్ళైనా నాలుగు అడుగులు వెనక్కి వేయాల్సిందే. గట్టిగా ఒక అరుపు అరిచిందంటే రెండు ఊళ్ళ వరకు వినిపిస్తుందేమో! దేహం కాస్త వణుకుతున్నా కూడా పట్టు తప్పని పట్టుదల మాత్రం సడలలేదు.
అంత పెద్ద ఉప్పుడు గిన్నెలు అమాంతంగా కిందికి దించి పెట్టింది. పిల్లలందరికీ ఉప్మాని ఆకులలో పెట్టి నిమ్మకాయ ఆవని అందరికీ వేసింది.
"ఇక తినండి రా"అంటూ అందరి వైపు చూస్తుంది.
అందరూ ఉప్పుడు పిండి నోట్లో పెట్టుకుని ఒకరిని చూసి ఒకళ్ళు తలలు ఆడించారు.
వీరి వెంట వచ్చిన పిల్లలు..
"ఒరేయ్ మీ నాయనమ్మ ఇప్పుడు పిండి ఎంతో బాగా చేసింది రా! కమ్మగా ఉంది!"అంటూ తింటున్నారు.
"అవునే శ్రీవల్లి మీ నాయనమ్మ చాలా మంచిది రోజు ఏదో ఒకటి మీకోసం చేసి పెడుతుంది మాకైతే ఎవరూ లేరు చేసి పెట్టడానికి"అన్నది శ్రీవల్లి స్నేహితురాలు.
మరో స్నేహితురాలు..
"మా నాయనమ్మ ఎప్పుడూ తిట్టడమే కానీ ఏమీ చేసి పెట్టదు"అన్నది.
ఇదంతా వింటున్న నాయనమ్మ..
"అలా పెద్ద వారి గురించి అనకూడదు. వారికున్న వసతులు ఏంటో! మీకు అందరికీ నేను చేసి పెడతా కదా"అంటూ గంటెతో అందరికీ మరలా మరలా వడ్డించింది.
"బాగుంది నాయనమ్మ!" అన్నది రమణి.
"అవునా! బిడ్డా! ఒకటి పిండి,ఒకటి నీళ్ల కొలత " అన్నది నాయనమ్మ.
"అబ్బా! బాగుంది అంటే చాలు మొత్తం చెప్తుంది" అన్నది శ్రీ వల్లి
పిల్లలంతా ఎంతో సంతృప్తిగా తిన్నారు. ఆకులన్నిటిని పెరట్లో ఓ మూలగా పెట్టేసి చేతులు కడుక్కొని మళ్లీ ఆడుకోవడానికి వెళ్లారు.
నాయనమ్మ కోడల్ని పిలిచింది.
"అంజలి! నువ్వు కాస్త తిందువు రా"! అన్నది.
"ఇప్పుడు వద్దులే అత్తయ్య! రాత్రికి ఎలాగూ భోజనమే చేస్తాం కదా! మీకు రాత్రికి మిగిలిందా? అంతా పిల్లలకే పెట్టారా?"అని అడిగింది గిన్నె చూస్తూ..
ఆ గిన్నెలో గుప్పెడు పిండి మాత్రమే ఉంది.
"అయ్యో మీకు ఏమీ మిగల లేదా"? అన్నది కోడలు.
"నాకు చాలు లేవే! ఎంత తింటాను? పిల్లలు తృప్తిగా తిన్నారు నాకు అదే చాలు"అంటూ బోసి నవ్వు నవ్వి ఆ గిన్నెను తీసుకెళ్లి వంటింట్లో పెట్టింది.
ఆ గుప్పెడు పిండిని మడిగా ఒక గిన్నెలోకి తీసుకొని, గిన్నెలో అడుగంటిన ఉప్పుడు పిండిని అంతా గీచి మరొక గిన్నెలోకి పెట్టింది. ఆ మాడప్ప అంటే శ్రీవల్లికి ఇష్టం అని దాచి పెట్టింది.
ఇలా నాయనమ్మ ప్రేమతో అందరూ తినాలని ఆలోచించేదే తప్ప ఈ వయసులో కూడా తానేదో విశ్రాంతి తీసుకోవాలని అని ఆలోచన లేదు.
No comments:
Post a Comment