(511) (13.01.2026)
పెళ్ళికి ముందు ఎవరినో కొంగుచాటు మొగుడంటే నవ్వుకుంటువి
నీ పెళ్ళైన తరువాత నిను కొంగుచాటు మొగుడంటే బాధపడితివి //
శ్రీమతి నోటి మాటకి అడ్డు చెప్పకుండా
శ్రీమతి చేసే పనులకు ఏనాడూ అడ్డు తగలకుండా
ఆ భగవంతుడు ప్రసాదించిన తలను ఊపుతూ
ఆమె అడుగులకు మడుగులు వత్తుతూ
చిరునవ్వుతో నడుచుకున్నావా జీవితం 3 పువ్వులు-6 కాయలు
కాదు అని ఒక్కసారి తల అడ్డంగా తిప్పినావా ఉండవు మెతుకులు //
పుట్టిన బిడ్డల నుంచి పిల్ల నిచ్చిన అత్త-మామల వరకు
నిను కన్న వారి నుంచి – రాబోయే అల్లుళ్ళు-కోడళ్ళ వరకు
ప్రతి దానికి నీవు సంజాయిషీ ఇచ్చు కోవలసి వస్తుంది
ఆపై ఊపిరి ఉన్నంత వరకు నరకం అనుభవించాల్సి వస్తుంది //
ఈ బాధలు ఎలాగూ అనుభవించక తప్పదు కనుక
శ్రీమతి చెప్పిన ప్రతి దానికి కాదు – లేదు అని అనక
ముందుకు అడుగులు వేసినావా నీవు ధన్యుడివి
కాదని ఎదురు తిరిగినావా అవుతావు గోడ మీద బొమ్మవి //
ఆ దేవుడు రాసిన రాతను నీవు ఎలాగూ మార్చి రాయలేవు
అలాగని ధైర్యం చేసి నీ శ్రీమతిని నీవు మార్చుకోలేవు //
నీ జీవితమంతా శ్రీమతి కొంగు చాటు మొగుడివే
సమాజంలో నీ బ్రతుకు ఆమెకు తోడు కోసం వచ్చిన వాడివే
అంతకన్నా నీకు ఏమి పెద్ద స్టేటస్ అనేది ఉండదు
ఎదురు తిరిగినంత మాత్రాన నీ స్టేటస్ ఏమి మారదు //
గొడవలు పడి శ్రీమతికి దూరం కావాలని అనుకోకు
కొంగు చాటు మొగుడనే బిరుదు చూచి బాధపడకు
నీ 50 ఏళ్ళ జీవితంలో నీవు ఎందరినో చూచుంటావు
వాళ్ళ సమాజంలో నీవు ఒక కొత్త సభ్యుడిగా చేరుతావు //
శ్రీమతి కొంగు చాటున తిరిగినావా నీకు రక్షణ ఉంటుంది
ఫలానా ఆమె మొగుడు అన్న పేరు వస్తుంది
నలుగురిలో గుర్తింపు కలుగుతుంది
ఏ ఒడిదుడుకులు లేకుండా నీ జీవితం సాఫీగా సాగుతుంది //
లేని పోని ఆలోచనలు ఏవో పెట్టుకుని
ఆపై భుజాలపై శంఖు-చక్రాలు రెండు వేయించుకుని
చిరునవ్వుల జీవితాన్ని చేజేతులా పాడు చేసుకోకు
కొంగు వదిలేసి మందులతో జీవితాన్ని నడిపించబోకు //
కొంగు పట్టనోడు నూటికో-కోటికో ఒక్కడు ఉంటాడు
వాడు ఏనాడో జీవితాన్ని పాడుచేసుకున్నాడు
వాడి జాబితాలో నీవు చేరాలని అనుకోకు
తప్పటడుగులు వేసి దెబ్బలు తగిలించుకోకు //
మూడు ముళ్ళు వేసినాక ఈ బాధలు అనుభవించక తప్పదు
కొంగు పట్టుకు తిరగకున్నా నీకు కొత్తగా గౌరవం ఏమీ రాదు
నీ జీవితంలో నీ పేరును మటుకు నీవు మరుస్తావు
ఫలానా ఆమె మొగుడు అన్న పేరుతో పిలవబడతావు
పాత పేరు తీసేసి కొత్త పేరు పెట్టారనుకో
సమాజంలో నీకు ఓ కొత్త స్ధానం కల్పించారని తెలుసుకో //
సరదాగా రాసిన కవిత
మధిర వెంకట రమణ, హైదరాబాద్
No comments:
Post a Comment