Tuesday, 10 June 2025

 మనసు తలుపు తెరవగానే 
మనను పొదివి పట్టుకుని ప్రేమగా 
లోపలికి తీసుకెళ్లి పరిమళాన్ని
పరిచయం చేసే  పిల్లగాలి

రెప్పల తెర తీయగానే 
చప్పున చేయి పట్టుకుని 
మనకోసం ముంగిట వేచిన 
వెలుగుల ముగ్గులు చూపే కాంతి

దూరంగా అదేపనిగా.....
మనల్నే పిలుస్తూ రారమ్మని 
ఆహ్వానిస్తూ కమ్మగా కూసే 
కోయిల స్వాగత గీతాలు

బయటకు అడుగు పెట్టగానే 
నిలువెల్లా వెచ్చగా తాకి 
నీకోసమే వచ్చానంటూ 
నులివెచ్చని హాయిని ఇచ్చే నీరెండ...

తూరుపు సింహాసనం అధిరోహించి
గగన వీధిని కొలువు చేయగా
జ్యోతి కలశం హేమకాంతులు 
ఒలికిస్తూ ఏతెంచే శుభతరుణం...

సకల చరాచర జీవాలకు 
సత్తువ సేమము ప్రసాదించి
నిఖిల జగమునకు నిరతము
చైతన్య  ప్రదాతగా  రక్షింప 

ఆగమించు దినమణికి 

🌸🌸🌸🌸

బృంద 🙏

No comments:

Post a Comment