Thursday, 26 March 2026

 *_ధర్మదేవుడు - రాజ్య రక్షకుడు :_*
===•===•===•===•===
*రాజభాండాగారంలో వార్షిక లెక్కల పరిశీలన జరుగుతోంది. భాండాగారం అధికారి ఖజానా పెట్టెలు తెరిపించాడు. అన్నీ సక్రమంగానే కనిపించాయి. కానీ ఒక మూలన ఉన్న చిన్న వెండి పెట్టెలో తేడా ఉంది.* 

*ఆ పెట్టెలో దేవాలయ నూతన గోపుర నిర్మాణానికి ప్రజలు సమర్పించిన ప్రత్యేక నిధి ఉంది. అది తెరిచినప్పుడు బంగారు నాణేలు కొంత తగ్గినట్లు కనిపించింది.*

*సభలో ఒక్కసారిగా చర్చలు మొదలయ్యాయి.*

*_“ఈ గది తాళం ఎవరి వద్ద ఉంటుంది?”_ అని రాజు ప్రశ్నించాడు.*

*భాండాగారం అధికారి వినమ్రంగా _“మహారాజా, ప్రధాన తాళం నా వద్ద ఉంటుంది. కానీ గోపుర నిధి లెక్కలు చూసేది ధర్మదేవుడే”_ అని  అన్నాడు.*

*అంతే అందరి చూపు ఒక్కసారిగా ధర్మదేవుడి వైపు తిరిగింది.*

*ఇంకో విషయం మూడు రోజుల క్రితం రాత్రి ఆలస్యంగా ధర్మదేవుడు భండార ప్రాంగణంలో కనిపించినట్టు గస్తీ సైనికుడు చెప్పాడు.*

*_“ఎందుకు వచ్చారు?”_ అని అడిగితే, _“పత్రాలు సరిచూడటానికి,”_ అని చెప్పి వెళ్లిపోయాడట.*

*ఇది విన్న వెంటనే అనుమానం గట్టిపడింది.*

*ధర్మదేవుడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతని ముఖంలో భయం లేదు… కానీ బాధ ఉంది.  ఉద్దేశపూర్వకంగా నిధిలోని బంగారు నాణేలని ఎవరో తీసుకున్నారు.*

*సభలో కొందరు మంత్రులు _“అధికారం దగ్గర ఉన్నవారే అవకాశం ఉపయోగించుకుంటారు”_ అన్నారు.*

*రాజు ధర్మదేవుడిని చూశాడు. _“నీవు చెప్పేది ఏమిటి?”_*

*ధర్మదేవుడు తలవంచి ఒక్క మాట అన్నాడు: _“నిజం ఎప్పుడూ మౌనంగా ఉండదు మహారాజా. అది బయటకు వస్తుంది.”_*

*ఆ క్షణం నుంచి అతనిపై ఆంక్షలు మొదలయ్యాయి.* 

*సభ ముగిసింది. ధర్మదేవుడు నిశ్శబ్దంగా తన గృహానికి చేరుకున్నాడు.* 

*ఆ రాత్రి అతడు విశ్రాంతి తీసుకోలేదు. గస్తీ సైనికుడు చెప్పిన మాటలు, భాండాగారం అధికారి సమాధానాలు అన్నీ గుర్తు చేసుకున్నాడు.*

*ఒక చిన్న విషయం అతనికి గుచ్చుకుంది. గోపుర నిధి పెట్టెపై ఉన్న ముద్ర. అది కొద్దిగా పక్కకు జరగినట్లు కనిపించింది. సాధారణంగా తాళం తెరిచినప్పుడు ముద్ర చీలిపోతుంది. కానీ ఇది చీలలేదు… కేవలం మళ్లీ అతికించినట్టు ఉంది.*

*మరుసటి రోజు ఉదయం తీర్పు ప్రకటించే సమయానికి ముందు, ధర్మదేవుడు భండారానికి వెళ్లాడు. అక్కడ నేలపై చిన్నగా పడిన ఎరుపు రంగు మైనపు చుక్క కనిపించింది. అదే రంగు మైనం భండాగారం అధికారి కార్యాలయంలో ఉండేది.*

*అతడు మౌనంగా ఆ చుక్కను రుమాలులో దాచుకున్నాడు.*

*సభ ప్రారంభమైంది. రాజు గంభీరంగా _“ధర్మదేవుడా, నీపై అనుమానం గట్టిగా ఉంది. చివరి అవకాశంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?”_*

*అందరి చూపులు అతడిపైనే.*

*ధర్మదేవుడు ముందుకు వచ్చి నమస్కరించాడు. _“మహారాజా, నిధి మాయం కాలేదు."_ సభలో గుసగుసలు.*

*_“అయితే ఎక్కడ ఉంది?”_ అని రాజు.*

*ధర్మదేవుడు నెమ్మదిగా రుమాలు తెరిచాడు. అందులో ఎరుపు మైనపు చుక్క.*

*_“ఈ ముద్ర తాళంతో కాదు, వేడి మైనంతో మళ్లీ అతికించారు. ఈమైనం కూడా భండారం అధికారి గదిలోనే ఉంటుంది.”_*

*సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. భాండాగారం అధికారి ముఖం మారింది.*

*_“అది యాదృచ్ఛికం!”_ అని అతడు అరవగా....* 

*అప్పుడే గస్తీ సైనికుడు ముందుకు వచ్చి తలవంచి _“మహారాజా,  నేను నిజం చెప్పాలి. నాకు ఆజ్ఞ ఇచ్చింది భాండాగారం అధికారి గారే. ధర్మదేవుడు రాత్రి వచ్చినది నిజమే కానీ అతడు నిధి కాపాడటానికే వచ్చాడు.”_*

*భండాగారాధికారికి తగిన శిక్ష వేసి కారాగారానికి పంపించేశారు. గస్తీ సైనికుడు క్షమాపణతో తప్పించుకున్నాడు.*

*ధర్మదేవుడిని రాజు ప్రశంసించాడు. సభ ముగిసింది.*
                                            🌑🌑🌑🌑🌑🌑

*ఆ రాత్రి రాజు అంతఃపురానికి సమీపంలోని చిన్న మండపంలోకి   ధర్మదేవుడిని పిలిచారు.*

*అతడు లోపలికి వచ్చి నిలబడ్డాడు. రాజు ఆసనంపై కూర్చున్నాడు. కొద్దిసేపు మౌనం తర్వాత రాజు నెమ్మదిగా అన్నాడు:*

*_“నిన్ను నేను పరీక్షించలేదు ధర్మదేవుడా..! కాలమే పరీక్షించింది. నీవు నిలిచావు.”_*

*ధర్మదేవుడు తలవంచి మౌనంగా ఉన్నాడు.*

*_“రాజ్యంలో భండారం కాపాడేవారు చాలామంది ఉంటారు. కానీ, ధర్మాన్ని కాపాడేవారు కొద్దిమంది మాత్రమే ఉంటారు.”_*

*అంటూ రాజు తన పక్కన ఉన్న చిన్న వెండి ముద్రను తీసుకున్నాడు. ఆ ముద్రపై రాజ్య చిహ్నం ఉంది.*

*_“ఇప్పటి నుంచి నీవు కేవలం లెక్కలాధికారివే కాదు. రాజ్యంలో ధర్మపరిశీలకుడివి కూడా.. ప్రతి శాఖను, ప్రతి అధికారిని గోప్యంగా పరిశీలించే బాధ్యత నీదే.”_*

*_“ఈ విషయం మనిద్దరికే తెలుసు”_ అన్నాడు రాజు గంభీరంగా.*

*ధర్మదేవుడి కళ్లలో కృతజ్ఞత _“మహారాజా, ధర్మం నిలబడితే చాలు.”_*

*రాజు తల ఊపాడు.*

*ఆ రాత్రి నుంచి రాజ్యంలో ఒక మార్పు మొదలైంది.. అధికారులు  బాధ్యతతో పనిచేయడం ప్రారంభించారు.*

*కొన్ని నెలలు గడిచాయి. రాజ్యంలో అధికారుల పని తీరు మారింది. క్రమశిక్షణ పెరిగింది.*

*ఒక ఉదయం రాజుగారి అంతఃపురం నుండి _“ధర్మదేవుడు వెంటనే రావాలి.”_ అని పిలుపొచ్చింది.*

*అతడు వచ్చి  నమస్కరించి నిలబడ్డాడు.*

*రాజు పక్కన ఒక యువకుడు నిలబడి ఉన్నాడు.. అతడు రాజకుమారుడు. వయసు తక్కువే. అప్పుడు రాజు గంభీరంగా అన్నాడు:*

*_“రాజ్యాన్ని కత్తితో గెలవవచ్చు. కానీ రాజ్యం నిలవడానికి ధర్మం కావాలి. నా కుమారుడు యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నాడు. కానీ ధర్మ విద్య నేర్పగలవాడివి నీవే.”_*

*ధర్మదేవుడు ఒక్కసారిగా తలెత్తి చూశాడు.* 

*_“మహారాజా..! నేను సాధారణ సేవకుడిని.”_*

*రాజు స్వల్పంగా చిరునవ్వు చిందించాడు. _“అందుకే నిన్ను ఎన్నుకున్నాను.”_*

*రాజకుమారుడు ముందుకు వచ్చి వినయంగా నమస్కరించాడు. _“గురుదేవా, నన్ను స్వీకరించండి.”_*

*ఆ రోజు నుంచి రాజకుమారుడి విద్య ప్రారంభమైంది.*

*ధర్మదేవుడు అతనికి కేవలం శాస్త్రాలు మాత్రమే కాకుండా, నిర్ణయం తీసుకునే ముందు మౌనం విలువ, అధికారానికి ముందు బాధ్యత, శిక్షించడానికి ముందు పరిశీలన, అనుమానించడానికి ముందు విశ్వాసం మొదలయినవి కూడా నేర్పాడు.*

*రాజకుమారుడు ఒకసారి _“గురుదేవా, మీపై అనుమానం వచ్చినప్పుడు మీరు కోపం తెచ్చుకోలేదేంటి?”_*

*ధర్మదేవుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, _“నిజం ఉన్నవాడికి కోపం అవసరం లేదు. అతనికి కాలమే సాక్ష్యం.”_*

*ఆ మాట రాజకుమారుడి హృదయంలో నిలబడిపోయింది.*

*కొన్నేళ్ల తర్వాత రాజకుమారుడు యువరాజుగా సింహాసనం అధిరోహించిన తరువాత, ప్రజలు యుద్ధంలో ధైర్యవంతుడుని రాజ్యరక్షకుడిని, నిష్పక్షపాతిగా న్యాయనిర్ణయంలో ధర్మరక్షకుడిని చూశారు.*
🛕🛕🛕🛕🛕🛕🛕
*_:-:{ఇది సేకరణే.. దీనికి ఆధారం.. "చిట్టిపొట్టి కథలు" అనే ఫేస్బుక్ వాల్..: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}:-:_*

No comments:

Post a Comment