Thursday, 26 March 2026

 శ్రీవారికి లేఖ
             ----------
                               
                                

ప్రియమైన మీకు,
                        ప్రేమతో నేను  వ్రాయునది.నేను ఇక్కడకు వచ్చి వారం రోజులైయ్యింది. ఈ వారం రోజులుగా మీరూ,పిల్లలూ ఎలా వున్నారో, ఏమి తింటున్నారో యేమోఅని బెంగగా అనిపిస్తోంది. పిల్లలు బయట తిళ్ళు తిన్నా,మీకు  బయటవిపడవుగదా!.మీరు మా అమ్మకు ఆరోగ్యం చిక్కేదాకా వుండమన్నారు కనుక వున్నాను కానీ,నాకు మిమ్మల్ని,పిల్లలను వదిలి వుండడం కష్టంగానేవుంది.మీకు కానీ, ఎదిగిన మన పిల్లలకు కానీ, కాస్తైనా వంట వచ్చివుంటే నాకు ఈ  బెంగవుండేదికాదు. మీకులానే పిల్లలకు కూడా వటింటి పనులంటే చిరాకు.గ్లాసుతో మంచినీళ్ళుకూడా బిందెలోవి ముంచుకొని తాగరు.
                    ఏవండీ! ఇప్పటి వరకు నేను మీకు ఇలా ఉత్తరం వ్రాసే అవకాశం రాలేదు.ఎందుకంటే ,మనపెైళ్ళైయ్యాకా ఒకరినొకరం విడిచి వున్నదేలేదు,పిల్లల పురుళ్ళకు కూడా మా వాళ్ళది పల్లెటూరని మీరు పంపించలేదుకదా!ఇప్పుడు  ఈ అడబాటుని అవకాశంగా తీసుకొని, నా మనసులోని మాటలు కొన్నిమీకు వ్రాస్తాను. ఇలా ఉత్తరాలు ఎందుకు? మనసులో మాటేదో ముఖతా చెప్పవచ్చుగదా అంటారేమో.ఎందుకంటే .నేనేది చెప్పినా మీరు చాలా తేలికగా తీసుకొంటారు. "అలా ఎందుకు" అని వాదనకు దిగుతారు.గొంతు పెంచుతారు. అది నాకిష్టముండదని మీకు తెలుసు. అందుకనే చిరాకు పడకుండా ఇప్పుడీ చిన్న ఉత్తరం పూర్తిగా చదవి నామనసులోని బెంగలూ,బాధలూ అర్థంచేసుకొంటారని ఆశపడుతున్నాను.
 మీ మంచి తనం నాకు తెలుసు. సహాయం అంటే చాలు, స్నేహితులైనా,బంధువులైనా,మనకి వున్నదాంట్లో సహాయం చేసే అవకాశం వుంది కనుక చేయవలసిందే అంటారు.నిజమే చేయవలసిందే కానీ,గవర్నమెంటు ఉద్యోగం చేస్తున్న మీరు, వారి కి బ్యాంకులలోన్లకు, చిట్ పండ్ లోన్లు మొదలైనవాటికి హామీ ఇవ్వడం అన్నది ఎంతవరకు మనకు క్షేమమో కాస్త ఆలోచించండి. తనకు మాలిన ధర్మం కూడదని చెపుతారు పెద్దలు. పోనీ చేస్తే చేశారుగానీ,ఒక లెఖ్ఖా పద్దూ,
ఎంతెంత ,ఎవరెవరికిఇస్తున్నారో , ఎవరెవరికి హామీలిస్తున్నారో ఎందిమీదనైనా వారెదురుగా నోట్ చేయండి. అంత్యనిష్టూరంకన్నా ఆదినిష్టూరంమేలుకదా!నాకు అటువంటి విషయాలు ఎవరిద్వారానో తెలుస్తాయి  తప్ప మీరు చెప్పరు.
నేను ఆడదానికి కనుక అన్ని విషయాలూ  చెప్పవలసిన అవసరం లేదన్నది మీ అభిప్రాయం అన్నది నాకు తెలుసు,                                ఇక పిల్లల చదువులకోసం 
ఖరీదైన ఫీజులు కట్టడమొక్కటే మీ భాద్యత అనుకోక ,కాస్త వాళ్ళ చదువుల విషయంలో కూడా పట్టించుకొంటే,బాగుంటుంది.అప్పుడప్పుడైనా,వాళ్ళ చదువులెలావున్నాయి?ప్రవర్తన ఎలావుంటోందన్నది వాళ్ళ మాష్టర్లనడిగి తెలుసుకోవడంకూడా మన భాద్యతే.అలా మనం వాళ్ళ విషయంలో శ్రధ్ధ పెడితే,పిల్లలు చెడునడత అలవర్చుకోకుండావుంటారు. పోనీ నాకు తెలిసినంతలో  మంచీ చెడూ చెపుదామన్నా ,పిల్లలదృష్టిలో నేనొక అజ్ఞానిని.    పిల్లలమీద అలవిగాని ప్రేమమతో  వాళ్ళు ఏమడిగినా క్షణాల్లో తెచ్చివ్వడమన్నది ఒకరకంగా వాళ్ళని పాడుచేయడమే అని నా అభిప్రాయం. మీరు ఒప్పకున్నా ఇదినిజం.   
                      
                            
 మరొక్క విషయం,నన్ను పిల్లల ఎదురుగా,ఆడదాన్నంటూ,నాకేమీ తెలియదనీ చిన్నబుచ్చకండి.నేను కూడా అంతో ఇంతో చదువుకొన్నాను. మనపెళ్ళికి ముందుగా  నేనూ మంచిఉద్యోగం చేశాను కదా!మీ కిష్టంవుండదని,ఆర్థికంగా మనకి లోటు లేదుకనుక, ఇంట్లోనే వుండిపోతున్నాను అనేవిషయం మీకూ తెలుసు.మనపిల్లలు  పెద్దవారవుతున్నారు.మీరు నాతో మాట్లాడే మాటలు వాళ్ళు శ్రధ్ధగావింటున్నారు.వారి దృష్టిలోకూడా
 ఆడవాళ్ళు
 అణిగి మణిగి వుండాలనే అభిప్రాయం యేర్పడితే,
భవిష్యత్ లో వాళ్ళు కష్టాలు పడవలసి వస్తుంది. ఎందుకంటే  మునుముందు ఆడపిల్లలు మాకాలం ఆడ పిల్లల్లా అణగి మణిగి వుండరు. వారికి అటువంటి అవసరంకూడాలేదు.
                         మీరు నామాటకు విలువిస్తే పిల్లలు నామాట వింటారు.విలువిస్తారు.రేపు వాళ్ళుభార్యలమాటకు విలువ యిస్తారు.భార్యాభర్తలది ఒకేమాటగా వుండే సంసారం ఎంతైనా వృధ్ధిచెందుతుంది.కానీ ఇప్పటికే  వాళ్ళకి, మీరు "నీకేమీ తెలియదు.నువ్వొట్టి అయోమయానివి" అంటుటారుకనుక , నామాట విననక్కరలేదనే అభిప్రాయంలో పిల్లలు వున్నారు.ఏమి చెప్పినా "'నీకేం తెలియదమ్మా !'"అంటున్నారు.మీరు గమనించండి.మీకైనా ,నాకైనా కావలిసింది వాళ్ళ అభివృధ్ధేగదా!
               ఇలాంటివే ఎన్నో విషయాలు మన కుటుంబంగురించి ,మంచీ చెడూ మీతో మాట్లాడాలనిపిస్తుంది.కానీ నేనేమి చెప్పినా తేలిగ్గా తీసిపారేస్తారు.కాదంటే నీకేంతెలియదంటూ చిరాకు పడతారు."సర్లెద్దూ సోది"అంటూ ఈసడిస్తారు.మీ మాటల్లో మా ఆడజాతినే కించపరిచినట్లనిపిస్తుంది నాకు.స్త్రీలపట్ల అదే చులకనభావం మన పిల్లల్లో పెరిగితే వాళ్ళు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారని నాభయం.
               నన్ను నెత్తిన పెట్టుకొని పూజించమని కానీ,నా కొంగట్టుకొని తిరగమని కానీ ,నేను కోరుకోవడం లేదు.కనీసంనన్ను ఒక మనసున్న మనిషిగా గుర్తించాలని కోరుకుంటున్నాను.అదేమీ తప్పుకాదుగదా! ఆలోచించండి.
                           మరొకమారు చెపుతున్నాను,నేనేమి చెప్పినా మన కుటుంబం శ్రేయస్సుకే చెపుతాననేవిషయం గమనించగలరు. 
నేనిలా వ్రాసేనని మరోలా భావించకండి.నా ఆవేదన అర్థంచెేసుకోగలరని ఆశిస్తున్నాను. 
                   ఇకపోతే మాఅమ్మకి నీరసం తగ్గగానే బయలుదేరి వస్తాను.నేను ఇక్కడున్నా నాదృష్టంతా మీపైనా,పిల్లలపైనేవుంటుంది.     ఇక వుంటాను,మనం కలుసుకున్నప్పుడు మనసు విప్పి మాట్లాడే అవకాశమిస్తారని ఆశిస్తూ,
               మీ లక్ష్మి

             సత్యవాణి కుంటముక్కుల

No comments:

Post a Comment