Thursday, 26 March 2026

 *(ఫిబ్రవరి 24 - 2026) -- బెంగాల్ మెజీషియన్ పి సి సర్కార్....*

*ఇంద్రజాల విద్యను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసి భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన గొప్ప ఇంద్రజాలికుడు పి సి సర్కార్.  ఈయన పూర్తి పేరు ప్రాతుల్ చంద్ర సర్కార్.  నేటి బంగ్లాదేశ్ లో ఉన్న తంగైల్ లో 1913 ఫిబ్రవరి 23న జన్మించారు.  వీరిది ఇంద్రజాలికుల కుటుంబం కావడంతో చిన్నతనంలో నే మేజిక్ విద్యపై ఆసక్తి పెంచుకుని 20 ఏళ్ల వయసులోనే 1933 నాటికి సంపూర్ణ మెజీషియన్ గా తనను తాను తీర్చిదిద్దుకున్నారు.  భారత ఇంద్రజాలానికి దేశ సంస్కృతి ని మేళవించి అంతర్జాతీయంగా ఆసక్తి ని కలిగించారు.  దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూనే 22 మేజిక్ సంబంధిత గ్రంథాలను పి సి సర్కార్ రచించారు.  భారతీయ సంస్కృతిలో భాగమైన ఇంద్రజాలానికి అధునాతన శాస్త్ర జ్జానాన్ని రంగరించి ప్రేక్షకులను మైమరిపించే విధంగా మేజిక్ కళను పి సి సర్కార్ ప్రదర్శించారు.  అనేక ట్రిక్ లను ప్రదరిస్తూ ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేసేవారు.  1964లో  మన భారత ప్రభుత్వం ఈయన్ని పద్మశ్రీ బిరుదుతో గౌరవించి విదేశాలలో సాంస్కృతిక రాయబారిగా నియమించింది.  నిద్రలో ఇంద్రజాలాన్ని శ్వాసిస్తాను.. మేల్కొన్నప్పుడు ఇంద్రజాలం చేస్తుంటాను అని పేర్కొనే పి సి సర్కార్ ఆ మాటల్ని నిజం చేస్తూ 1971 జనవరి 6న తన 58వ ఏట జపాన్ దేశంలో ఇంద్రజాలాన్ని ప్రదర్శిస్తూ గుండెపోటుతో మరణించారు.  వీరి కుమారుడు మనవడు కూడా జూనియర్ సర్కార్ లుగా మేజిక్ విద్య ప్రదర్శన లలో ఆరితేరి రాణించారు.  ఇలా విశ్వవిఖ్యాత మెజీషియన్ గా పి సి సర్కార్ దేశవిదేశాల్లో అసంఖ్యాక అభిమానులను సంపాదించుకున్నారు.  వీరి జయంతి రోజు సందర్భంగా ఏటా ఫిబ్రవరి 23న కొన్ని దేశాలలో అంతర్జాతీయ ఇంద్రజాలికుల దినోత్సవం గా పరిగణిస్తారు.  భారత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసినవారిలో వరల్డ్ ఫేమస్ మెజీషియన్ పి సి సర్కార్ ఒకరు అనేది వాస్తవం....* 

*గాదె లక్ష్మీ నరసింహ స్వామి* (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....

No comments:

Post a Comment