Thursday, 26 March 2026

 (549) (20.02.2026)

అమ్మా నీకు పెళ్ళి చేసి అత్త వారింటికి పంపించినాము
అపుడపుడు మమ్ము చూడటానికి వస్తావని ఆశించినాము
మంచి ఉన్న సంబంధం దొరికిందని మము మరిచినావు
ఆపై పుట్టినింటికి రావడమే మానుకున్నావు // 

ఇంద్ర భవనం లాటి ఇల్లు అని
ప్రతి పనికి పని వాళ్ళు ఉంటారని
ఏ పని చేయవలసిన అవసరం లేదని
రాణిలా బ్రతుకుతున్నానని //

రెండు గదుల ఇంటిలో ఉండలేనని
కట్టెల పొయ్యి మీద వండే వంట తినలేనని
సుఖానికి అలవాటు పడ్డానని
కష్టపడటానికి మనసు ఒప్పుకోదని //

మా ముఖం మీదే చెప్పినావు
అందుకే రాలేనని అన్నావు
పెళ్ళికి ముందు రోజులు గుర్తు చేసుకో
మన జీవన విధానాన్ని తలచుకో //

ఉన్న వారి సంబంధం వచ్చిందని విర్ర వీగకు
వారితో పోల్చుకుని మాకు దూరం కాబోకు
ఎంతైనా మేము నిను కన్న వాళ్ళము
మా ఊపిరి ఉన్నంత వరకు నిను చూడకుండా ఉండలేము //

మేము బ్రతికి ఉన్నంత వరకు రాను అన్న మాట అనబోకు
అక్కడి ఆస్తిని చూచి మమ్ము చిన్న చూపు చూడకు
నీ కన్న వారిని చూచేది మేము బ్రతికి ఉన్నంత వరకే
మమ్ము అమ్మ-నాన్న అని పిలిచేది మేము ఉన్నంత వరకే //

మధిర వెంకట రమణ, హైదరాబాద్

No comments:

Post a Comment