*****
*నేషనల్ ఎకో*
===============
(జ్ఞాపకాల పందిరి)
(ఈరోజు ఫిబ్రవరి 13, వరల్డ్ రేడియో డే సందర్భంగా)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్.
రేడియో జ్ఞాపకాలు గురించి చెప్పడమంటే నా చిన్నతనం రోజులు అంటే 1960 దశాబ్దం నాటి రోజులు మళ్లీ ఓసారి జ్ఞాపకం చేసుకోవడమే! అందుకే నాకు చాలా ఇష్టం.
జగన్నాధగిరిలో ఎనిమిది గదులున్న మా ఇంట్లో నాన్న గారి ఆఫీసు గదిలో ఉన్న అలమారలోని పై అరలో ఉండేది లేత కాఫీ పొడి రంగంలో ఉన్న రేడియో. ముందు వైపు మిలమిల మెరిసిపోతున్న బంగారు రంగు వల, దానికి ఎడమవైపు పైన ఒంటికన్ను రాక్షసుడులా మిణుకు మిణుకూ అంటూ ఉండే ఆకుపచ్చ లైటు. దాని కింద రెండు వైపులా పౌడర్ డబ్బా మూతల్లాంటి రెండు గుండ్రటి నాబ్స్, ఆ రెండింటి మధ్య అంకెలతో ఉన్న గాజు పలక.
ఆ పలక మీద బీట్ కానిస్టేబుల్ లాగ అటూఇటూ తిరిగే ఎర్రటి ముల్లు, దాని కింద గేదె పళ్లు లాంటి ఐదు బటన్స్ తో ఉండేది పెద్ద సైజు నేషనల్ ఎకో రేడియో. అది మా నాన్నగారు అందుకు ముందు ఎప్పుడో మద్రాసు నుంచి తెచ్చారని జ్ఞాపకం.
ఉదయం మేము లేచి, వెండి జారీలతో (అప్పట్లో స్పెయిన్ లెస్ స్టీల్ ఇంకా వాడకం లోకి రాలేదు) పాలు తాగే సమయానికి రేడియోలో రజనీ బాబాయ్ గారు, మల్లిక్ గారు, సుబ్బలక్ష్మి గారు వచ్చి, సూర్యాష్టకం, పురందరదాసు, అన్నమయ్య కీర్తనలు, సుప్రభాతం లాంటి ఎన్నో రకాల భక్తి పాటలు *భక్తి రంజని* కార్యక్రమంలో పాడేసి వెళ్లిపోయేవారు.
మధ్యాహ్నం భోజనాలు అయిన తరువాత నాన్న గారు *కార్మికుల కార్యక్రమం* విని, నిద్ర పోయేవారు. ఇక వారాంతంలో వచ్చే *సంక్షిప్త శబ్ధ చిత్రాలు* అలాగే నండూరి సుబ్బారావు గారు, బందా కనకలింగేశ్వరరావు గారు, సీతారత్నమ్మ గారు, పుచ్చా పూర్ణానందం గార్ల ఆధ్వర్యంలో వచ్చే గణపతి లాంటి *రేడియో నాటకాలు* గురించి,
అలాగే
"రారండోయ్ రారండోయ్, బాలల్లారా రారండోయ్, బొమ్మరింటికి రారండోయ్" అంటూ వచ్చే *బాలానందం* కార్యక్రమాలు గురించి ఎంత చెప్పినా తక్కువే.
ముఖ్యంగా ఈ పాటను నేను
"రారండోయ్ రారండోయ్, బాలల్లారా రారండోయ్, బొమ్మరింటికి రారండోయ్, కొట్టుకుంటూ తిట్టుకుంటూ బాలల్లారా రారండోయ్" అని వెటకారంగా పాడడమూ, అది విన్న మా అమ్మగారు వచ్చి నా వీపు మీద విసినకర్రతో ప్రైవేటు చెప్పేయడమూ..
అంత త్వరగా మరచిపోయే విశేషాలా?
ఇక రేడియో కార్యక్రమ వివరాలు తెలుపుతూ వెలువడే "వాణి" అనే పత్రికలో వచ్చే వివరాలు ప్రకారం రాత్రి పూట కార్యక్రమాలు మాత్రం తప్పకుండా వినేవారు నాన్న గారు.
రాత్రి పడుకునే ముందు రేడియోలో వచ్చే *నిలయ విధ్వాంసుల వాద్య కచేరీ* లో వచ్చే డీకే పట్టమ్మాళ్, సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్, దోమాడ చిట్టబ్బాయ్ గార్ల లాంటి లబ్ధప్రతిష్టుల కార్యక్రమాలు విన్న తరువాత, వారిని సాదరంగా ఇంటికి పంపిన తర్వాత మాత్రమే నాన్న గారు నిద్రకుపక్రమించేవారు.
నాకు బాగా చిన్న తనంలో ఓ రోజు సాయంత్రం రేడియోలో ఎవరిదో బుర్రకధ వస్తోంది. నేను, మా తమ్ముడు కృష్ణ మా పెద్ద అన్నయ్యను "ఆ మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కడుంటారు" అని అడిగాము ఆశ్చర్యంగా. దానికి "చూపిస్తా, రండి" అని మమ్మల్ని ఎత్తుకుని ఆ గాజు పలక మీద చూపించాడు. నిజంగా అందులో ఎవరో ముగ్గురు అటూ ఇటూ కదులుతున్నట్టు కనబడి బోలెడు ఆశ్చర్యపోయాము.
ఆ తర్వాత చాలా రోజుల తరువాత తెలిసింది, అది మా అన్నయ్య చేసిన జిమ్మిక్క్ అని. అది కూడా ఎలా తెలిసిందంటే...
ఓ రోజు మా రెండో తమ్ముడు సత్తిబాబు ఆ కుడి వైపు ఉన్న చక్రాన్ని బలం కొద్దీ తిప్పేసాడు, అది స్టేషన్ తెలియచేసే ఎర్రటి ముల్లు అని తెలియక ! పాపం, ఆ దెబ్బతో ఆ మల్లు రేడియో లో ఉన్న అన్ని స్టేషన్లు దాటుకుంటూ చివరకంటా వెళ్లి, వేరే మార్గం లేక లోపల ఉన్న నైలాన్ తాడు ఢామ్మని తెగిపోవడంతో నడుము విరిగి అక్కడే కూలబడిపోయింది.
దానితో కోప్పడిన నాన్న గారు మా ఇంట్లో ఉండే గన్నెయ్య తాతని దానిని రిపేర్లు చేసే కామాచార్యులు గారి తమ్ముడు అయిన ప్రకాశరావు గారి ఇంటికి తీసుకుని వెళ్లమని చెప్పారు.
గన్నెయ్యతో పాటూ మా బేబన్నయ్య, నేనూ బయలుదేరాము. ఆయన ఆ రేడియోని ఏ పార్టుకి ఆ పార్టు విప్పి పక్కన పడేసి, ఆ ముల్లును మళ్లీ ట్వైన్ దారంతో బిగించి కట్టి, మళ్లీ రేడియో ఆన్ చేసి, అసలు రేడియో ఎలా పని చేస్తుందో చూచాయగా చెప్పారు.
అప్పుడు తెలిసింది, గతంలో మా అన్నయ్య చేసిన జిమ్మిక్కు. అది ఏమిటంటే... ఆ మూడూ మా అన్నయ్య చేతి వేళ్లనీ. ఆ గాజు పలక మీద పడేలా వేళ్ళు అటూ ఇటూ తిప్పుతూ, అవి మనుషులు అనే భ్రమ మాకు కల్పించాడనీ.
ఇక ఆ రోజుల్లో మా ఊరు మొత్తం మీద ప్రెసిడెంట్ వసంతరాయుడు గారికి, కరణం పెరవలి సత్తిరాజు గారికి, మాకూ మాత్రమే ఉండేవి రేడియోలు. ప్రెసిడెంట్ గారు అంటే భయం వలననూ, కరణం గారింట్లో లోపలి గదిలో ఉండడం వలననూ, మా ఇంట్లో అయితే నాన్న ఆఫీసు గది వీధి అరుగుకు చేర్చి ఉండడం వలన, జనమంతా సాయంత్రం ఆరు గంటలకు మా ఇంటి అరుగుమీదకు చేరుకునేవారు, ప్రాంతీయ వార్తలు, ఢిల్లీ వార్తలు వినడానికి.
రాత్రి ఏడు గంటల వరకూ సాగేది ఈ కాలక్షేపం. మా అమ్మ మాత్రం "ఏవిటో ప్రతీరోజూ ఈ మేళం అరుగుమీదకు వెళ్లడానికి లేకుండా" అని మూతి విరుచుకుంటూ విసుక్కునేది.
ఆ రోజు బాగా గుర్తు.
అది 1964 వ సంవత్సరం, మే 27 తారీఖు.
అప్పటికే ఆ విషయం ఊర్లో చాలా మందికి తెలిసిపోయింది. అయినా మా ఇంట్లో ఉన్న రేడియోలో వినాలని అందరూ మా అరుగుమీదకు చేరుకున్నారు.
నాన్నగారు రేడియో పెట్టగానే
"ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది.. ....
మన దేశ ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ ఈ రోజు కన్ను మూసారు.........." వెనకనుంచి అలో లక్ష్మణా అన్నట్టు విషాదసంగీతం నెమ్మదిగా వినిపిస్తూ ఉండగా రేడియోలో వార్తలు అలా వస్తునే ఉన్నాయి.
"ఏటండీ రాజుగారూ! ఈ ధారుణం? కొంపదీసి ఎవరైనా చంపేసారంటారా?" నోట్లో చుట్టని గిరగిరా తిప్పుతూ, పొగ వదులుతూ అడిగాడు మా ఇంటి పక్క ఉండే బూడిద తాతబ్బాయి.
"ఉండవయ్యా, మగడా ! పూర్తిగా వినబడనీకుండా మధ్యలో నీ గోల ఏమిటి? పూర్తిగా విను" సున్నితంగా కసురుకున్నారు మా ఇంటి ఎదురుగా ఉండే రాచపల్లి రాజుగారు.
"ఇంకేం వింటామండీ. ఇంక ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి" అంటూ తువ్వాలు ఓ సారి గట్టిగా ఝాడించి భుజం మీద వేసుకుని వడివడిగా మెట్లు దిగి వెళ్లి పోయాడు, పక్కా కాంగ్రెసు వాది అయిన బూడిద తాతబ్బాయి.
అలాగే 1963 లో అమెరికా ప్రెసిడెంట్ కెనడీ గారు మరణించిన సమయంలో వచ్చిన వార్తలు, అవి వినడానికి వచ్చిన జనం... నాకు ఇప్పటికీ జ్ఞాపకం.
కొంచెం ఊహ తెలిసిన తర్వాత మా అన్నయ్యలు, అలాగే మా ఇంటి ఎదురుగా ఉండే రాజుగారి అల్లుడు సత్తిబాబు గారు, అలాగే మా అన్నయ్యల ఫ్రెండ్ యర్రంశెట్టి సత్యనారాయణ పెట్టే అమీన్ సయానీ వ్యాఖ్యానంతో బుధవారం రాత్రి వచ్చే *బినాకా గీత్ మాలా*, అలాగే ప్రతీరోజూ ఉదయం ఏడూ ఏభై ఐదుకు వచ్చే కే. యల్. సైగల్ పాట, ఇంకా...*బెహనోంకీ పసంద్* ..చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో ఎన్నో.. జ్ఞాపకాలు.
ఆ తర్వాత ఆ రేడియో మా అన్నదమ్ముల ఇళ్లల్లో కొన్నాళ్లు విధులు నిర్వహించి చివరికి శాశ్వతంగా విశ్రాంతి తీసుకుని ఈ లోకం నుంచి నిష్క్రమించింది.
మరి అంతేనండి మా జగన్నాధగిరి లోని
నా రేడియో జ్ఞాపకాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
ఎప్పుడైనా వీలైతే ఇంకో అలవరసలపై ఎలాగో అలాగ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా.
మరి అంతవరకూ సెలవు.
నమస్కారం.
***** **సమాప్తము** *****
No comments:
Post a Comment