Tuesday, 13 January 2026

 🌷🙏తెలుగు వారి 'సీత' శ్రీమతి అంజలీదేవి గారి వర్థంతి  సందర్భంగా....🙏🌷

#తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అంజలీదేవి తన నటనతో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా సీత పాత్రలో అంజలి నటనకు అప్పట్లో బ్రహ్మరధం పట్టారు.అభినవ సీతమ్మగా పేరొందారు. అచ్చతెలుగు ఆడబడుచు అంజలీదేవి రంగస్థలంతో తన నట జీవితాన్ని ప్రారంభించి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఒక చిన్న క్యారెక్టర్ తో వెండి తెరపై అడుగు పెట్టిన అంజనీ కుమారి.. అంజలీదేవిగా జానపద, పౌరాణిక, సాంఘిక, సినిమాల్లో నడిచి తనదైన ముద్ర వేశారు.

#ఆమెకు ఆమేసాటి. మరెవ్వరితోనూ పోల్చలేని వ్యక్తిత్వం, నటన, నృత్యం… తెలుగునాట సినీరంగం వేళ్లూనుతున్న తరుణంలో మెరిసిన సువర్ణసుందరి. పదేళ్ల వయసులో తొలిసారి స్టేజిఎక్కి లోహితాస్యుడు పాత్రపోషించారు. ఇలా తలపాగా చుట్టుకుని మగపిల్లాడిపాత్రతో నటనకు శ్రీకారం చుట్టారు. 

#బాల్యం:

అంజలీదేవి 1927, ఆగష్టు 24న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురంలో జన్మించింది.ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి. పుల్లయ్య ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు.

#నాటకరంగంలో:

తొలినాళ్లలో కాకినాడ యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ లో చేరినతర్వాత అనేక నాటకాల్లో నటించారు. వాటిలో కొన్ని ఆదినారాయణరావు దర్శకత్వం వహించినవి కూడా ఉన్నాయి. – 1941లో మద్రాసులో జరిగిన ఆంధ్రనాటక కళాపరిషత్ లో `ఆంధ్రశ్రీ’ నాటకంలో మాంచాల పాత్రపోషించి ఉత్తమనటి అవార్డు అందుకున్నారు. అప్పటికి ఆమె వయసు 14ఏళ్లు.  విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన `వేమరాజు’ నాటకంలో నటించారు.1943లో డిసెంబర్ లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ సర్ ఆర్థర్ హోప్ విశాఖపట్నం వచ్చినప్పుడు అంజలీదేవి నాట్యప్రదర్శన చూసి ఆమె నాట్యతీరుని ప్రశంసించారు.

బొంబాయి అల్లర్లలో ప్రాణభయంతో ఇబ్బందులు పడాల్సివచ్చింది. 40వ దశకంలోనే ఎల్ వి ప్రసాద్ దర్శకత్వంలో టి.సుబ్రహ్మణ్యశాస్త్రి `మేనకోడలు’పేరిట చిత్రం తీయాలనుకున్నారు.ఇందులో నటించాలంటూ అంజలీదేవికి బొంబాయి నుంచి కబురొచ్చింది. తండ్రితో కలిసి బొంబాయి వెళ్లారు. అయితే ఎంతకీ పిలుపురాలేదు. ఇంతలో బొంబాయిలో అల్లర్లు చెలరేగడంతో చేతిలో డబ్బుల్లేక చేతిగాజులు అమ్మేసి టికెట్లు కొనుక్కుని వెనక్కి వచ్చేశారు. ఈ కష్టసమయంలో ఆమె కుటుంబాన్ని ఆదినారాయణరావు ఆదుకున్నారు. కాకినాడలోని తన యంగ్ మెన్ హ్యాపీక్లబ్ లో నెలకు వంద రూపాయల జీతంతో అంజలీదేవిని ఆర్టిస్ట్ గా నియమించారు. – వీధిగాయకులు అనే నాటకం అప్పట్లో సూపర్ హిట్. ఇందులో పాటలకు అంజలీదేవి అద్భుతంగా నృత్యంచేశారు. 
ఆ తర్వాత సంగీత దర్శకుడు  పి. ఆదినారాయణ రావును ఆమె వివాహం చేసుకున్నారు. 

#సీనీరంగం:

చిత్తూరి నాగయ్య పిలుపుతో అంజలీదేవి మద్రాసు వెళ్ళి గొల్లభామ (1947)లో నటించారు. `ఈ పొట్టిపిల్ల ఎక్కడ దొరికిం’దంటూ సినీవర్గాల్లో చాలామంది చెవులు కొరుక్కునేవారట.అయితే అందులో మోహిని పాత్రను పోషించిన తీరుచూసి అంతా ఆశ్చర్యపోయారని చెబుతుండేవారు. – 1948లో బాలరాజు సినిమా సూపర్ హిట్. అందులో ఏఎన్నార్, ఎస్.వరలక్షీ హీరోహీరోయిన్లే అయినా అంజలీదేవికి పాత్ర లభించింది. ఇంద్రసభలో నాట్యంచేసే యక్షిణి పాత్ర అది. ఈ యక్షిణే ఇంద్రుని శాపం కారణంగా మానవకాంతగా (ఎస్. వరలక్ష్మి)గా పుడుతుంది. ఈ సినిమాలో అంజలీదేవి నృత్యం చూసితీరాల్సిందే. వక్కలంక సరళ పాడినపాటకు (ఈ తీయని వెన్నెల రేయి) అంజలీ హోయలుబోతూ చేసిన నాట్యం ప్రేక్షకజనాన్ని ఊర్రూతలూగించింది. – వాహినీవారి కీలుగుర్రంలో కూడా అంజలీదేవిది హీరోయిన్ పాత్రకాదు. రాక్షసి మాయారూపంలో కనిపించే వ్యాంప్ పాత్ర ఇది. అయినా ఆ పాత్రచేయడానికి అంగీకరించి అందరి మన్ననలు అందుకున్నారు. – 1950లో ప్రతిభావారి స్వప్నసుందరి సినిమాలో దేవకన్యలా ప్రత్యక్షమై తెలుగుప్రేక్షకులను మైమరిపించారు. ఈ సుందరి పక్కన అందాల నటుడు అక్కినేని రాకుమారునిగా నటించారు. 

చలాకీగా `పల్లెటూరి’ పిల్లలో నటించి, `పక్కింటమ్మాయి’గా మరింత హుషారు పెంచారు అంజలీదేవి. ఆ తర్వాత హీరోయిన్ గా స్థిరపడ్డాక సొంతంగా సినిమాలు తీయడం ప్రారంభించారు. సొంతబ్యానర్ మీద అక్కినేనితో కలసి `పరదేశి’ సినిమా తీశారు. అటుపైన అనార్కిలి సినిమాతీసి అద్భుతవిజయం సాధించారు. 1957తర్వాత ఆమె చేసిన సినిమాలు ఒక్కొక్కటీ ఒక్కో ఆణిముత్యమే. -`సతీఅనుసూయ’, `చెంచులక్ష్మి’ మరువలేని చిత్రాలు. అంజలీ పిక్చర్స్ నిర్మించిన `సువర్ణసుందరి’ అంజలీదేవి లావణ్యానికీ నటనకు గీటురాయిగా నిలిచింది. – 60వ దశకంవరకు ఆమె హీరోయిన్ గా ఉన్నారు. వయసుపెరగడంతో పాత్రలఎంపిక విషయంలో మెలుకువలు ప్రదర్శించారు. 

ఆ సమయంలోనే ఆమె `#లవకుశ’ సినిమాలో సీతగా ఒదిగిపోయారు. ఆ సినిమా చూసిన తర్వాత #అంజలీదేవి ఎక్కడ కనిపించినా ఆమెను #సీతమ్మతల్లిగానే భావించి దండాలుపెట్టేవారు. `ఎన్నికష్టాలు పడ్డావే నా తల్లీ’ అంటూ పెద్దలు ఓదార్చేవారట.

పెద్దరికంలో `బడిపంతులు’ సినిమాలో అంజలీదేవి ముసలి దంపతుల్లో భార్యగా ఎన్టీఆర్ పక్కన నటించారు. `నీ నగుమోము, నా కనులారా, కడదాకా కననిండూ…’ అన్న పాట ఇప్పుడువిన్నా భావోద్వేగానికి గురికావాల్సిందే. – 240కిపైగా చిత్రాలు నటించారు. 1994లో పోలీస్ అల్లుడు సినిమాలో నటించిన తర్వాత మళ్ళీ ఏ సినిమాలోనూ ఆమె నటించలేదు.

#నిర్మాతగా:

అంజలీ పిక్చర్స్
అనార్కలి (1955) లో అంజలీదేవి నాయికగా అక్కినేని నాగేశ్వరరావు జతన నటించిన సినిమాను నిర్మించింది. ఆ తరువాత భక్త తుకారాం (1973), చండీప్రియ (1980) నిర్మించింది. చండీప్రియలో జయప్రద నాయికగా శోభన్ బాబు, చిరంజీవి లతో నటించింది. మొత్తం ఈ సంస్థ 27 సినిమాలు నిర్మించింది.

*#ఎస్వీఆర్ విషయంలో అంజలీదేవి ఏంచేసిందో తెలుసా…*

ఎస్వీ రంగారావు. నాటకాల్లో వేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఈయన నటుడవ్వాలని మద్రాసు వెళ్లారు. వెళ్లిన వెంటనే ఛాన్స్ లు రావుకదా.
చేతిలో చిల్లిగవ్వలేక, మంచినీళ్లు తాగి కడుపు నింపుకున్న రోజులెన్నో ఆయన జీవితంలో ఉన్నాయి. పైగా పడుకోడానికి పేపర్లు గతి అయ్యాయి. అలా నిద్రాహారాలు కరువైన పరిస్థితిలో ఇబ్బంది పడుతున్న ఎస్వీ ఆర్ వెనక్కి వెళ్లిపోవాలని అనుకుంటున్న సమయంలో అంజలీదేవి చేయూత నిచ్చింది. అప్పటికే సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తున్న అంజలీదేవి కాకినాడలో నాటకాలు వేసేటప్పుడు ఎస్వీఆర్ తో కల్సి చేసింది. ఎస్వీఆర్ పడుతున్న కష్ఠాలు చూసి, మన ఇంటికి ఎస్వీఆర్ ఎప్పుడొచ్చినా భోజనం పెట్టండి అని వంట మనిషి అయ్యర్ కి చెప్పిందట.
అలా ఆయన ఆకలి తీర్చడమే కాకుండా సినిమాల్లో ఛాన్స్ ఇప్పించింది. అలా 1946లో చేసిన వరూధిని మూవీ ప్లాప్ కావడంతో ఎస్వీఆర్ కి మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. దీనికి తోడు పెళ్లి కూడా చేసారు. మద్రాసు వదిలి వెళ్ళిపోదామని అనుకుంటున్న సమయంలో ఇలా జరగడంతో డీలా పడ్డాడు. అదే సమయంలో పాతాళభైరవి రూపంలో అదృష్టం తలుపు తట్టింది. ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఆ సినిమా విజయంతో వరుస పెట్టి ఛాన్స్ లు రావడంతో మహానటుడయ్యారు.

#పురస్కారాలు:

ఫిలింఫేర్ అవార్డ్
*ఉత్తమ నటి - తెలుగు - అనార్కలి (1955)
*ఉత్తమ నటి - తెలుగు - సువర్ణ సుందరి (1957)
*ఉత్తమ నటి - తెలుగు - చెంచు లక్ష్మి (1958)
*ఉత్తమ నటి - తెలుగు - జయభేరి (1959)
*ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్.
*రఘుపతి వెంకయ్య పురస్కారం .
*2005 లో తెలుగు సినీరంగం జీవితకాల సాఫల్యత పురస్కారం.
*రామినేని పురస్కారం - 2006.
*ANR జాతీయ పురస్కారం - 2008.

ఆమె కుమారులిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. అంజలీదేవి 2014 జనవరి 13న కన్నుమూశారు.

#అంజలీదేవికి గుర్తుగా పెద్దాపురంలో విగ్రహం ఏర్పాటు.....

అంజలీదేవిపై ఉన్న అభిమానంతో ఆమె గుర్తుగా పట్టణంలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆమె అభిమానులు. పైగా ఆమె మరణానంతరం ఆమె పేరుతో ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తూ ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ప్రతీ సంవత్సరం ఆమె పేరుతో ఫౌండేషన్‌ తరుపున పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

#సాత్విక, కరుణరసాత్మక, పవిత్రమైన పాత్రలతో తెలుగు ప్రేక్షక హృదయాలను మైమరపించిన మహానటి ఆమె. #కలియుగ అభినవ సీతమ్మగా తెలుగు సినీ రంగంలో ఖ్యాతి నార్జించిన అందాల నటి అంజలీదేవి. కేవలం తన నటనతోనే కాకుండా అభినయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడం ఆమె ప్రత్యేకత.నటనలో ఆమెకు సాటి మరెవరూ రారు.
వెండితెర అభిమానులకు అజరామర స్మృతులను విడిచి వెళ్లిపోయిన #మహోన్నత వ్యక్తి అంజలీదేవి.
"జీవితమే సఫలము రాగసుధా భరితము…..ప్రేమ కథ. మధురము"
🙏🏵️🌹🌷🌺🌸🙏
Collected by
Dr.A.Srinivasa Reddy
9912731022
Zphs75tyallur,
Pedakurapadu mandal Palanadu district.

No comments:

Post a Comment