Tuesday, 13 January 2026

 గాలిపటం - ఒక ఆత్మగౌరవం .


ఆకాశం ఎవరి అబ్బసొత్తు కాదు..
కానీ, గాలిపటం ఎగరాలంటే మాత్రం
కింద ఎవడో ఒకడు భూమిని నమ్ముకుని నిలబడాలి!
వాడు.. బురదలో కాళ్లున్నా, కళ్లు మాత్రం ఆకాశం మీద ఉన్నవాడు.
 పోరాటం ఒక వెదురు బద్ద.. రెండు కాగితపు ముక్కలు
నలుగురు కలిసి తొక్కేసిన పాత వార్తా పత్రికలు..
అదే దాని శరీరం!
మైదానంలో విలాసవంతంగా ఎగిరే 'డెకార్' పతంగుల మధ్య
ఈ పేదవాడి గాలిపటం..
ఒక తిరుగుబాటులా పైకి లేస్తుంది.
రంగుల హంగులు లేకపోవచ్చు..
కానీ, ఎగరాలనే కసి ఆ కాగితపు నరాల్లో ప్రవహిస్తోంది!
 చేతులు తెగుతున్నా వదలని పట్టు..
అది కేవలం దారం కాదు, ఒక నమ్మకం!
వారసత్వంగా వచ్చిన చిరుగుల బతుకును
ఆకాశానికి అతికించాలనే తాపత్రయం.
క్రింద వాడు 'డీల్' ఇస్తుంటే..
పైన గాలిపటం 'పేచీ' పెడుతుంది.
అధికారపు గాలివాటుకు తలవంచకుండా..
ఎదురుగాలిని గుండెల్లోకి నింపుకుని
ఎత్తుకు ఎగరడమే దానికి తెలిసిన విద్య!
ఆధిపత్యపు కోతలు నగరపు మేడల మీద మాంజాలు మెరుస్తున్నాయి
క్రింద బస్తీ కుర్రాడి చేతిలో దారం తెగుతోంది..
ఒకడికి అది పందెం.. మరొకడికి అది ప్రాణం!
కానీ, తెగిన గాలిపటం ఎప్పుడూ ఓడిపోయినట్టు కాదు..
అది బంధనాల నుంచి విముక్తి పొంది
స్వేచ్ఛా వాయువులను వెతుక్కుంటూ వెళ్తున్న ప్రయాణం.
ముళ్ళకంపలో చిక్కుకున్నా.. అది ఒక గాయం కాదు,
మరో పోరాటానికి సిద్ధమవుతున్న ఒక విరామం!
మట్టి మనుషుల కల ఓ గాలిపటమా!
నువ్వు ఎంత ఎత్తుకు వెళ్లినా..
నీ మూలాలు మాత్రం కింద ఉన్న చేతుల్లోనే ఉన్నాయి.
నువ్వు గాలిని చీల్చుకుంటూ వెళ్తున్నావు అంటే
వెనుక నిన్ను లాగి పడుతున్న 'గతం' ఒకటుందని మర్చిపోకు!
రాజకీయపు గాలివాటుకు రంగులు మార్చేవాళ్లు కొందరు..
తోక ఆడించి యజమానిని మెప్పించేవాళ్లు మరికొందరు..
కానీ, నువ్వు మాత్రం..
ఆకాశపు నీలి రంగులో నీకంటూ ఒక సంతకాన్ని చెక్కు!
 పండుగ ముగుస్తుంది.. సంక్రాంతి వెళ్ళిపోతుంది
కానీ, ఆకాశంలో మిగిలిపోయిన దారపు పోగులు
మనం చేసిన గాయాలకు ఆనవాళ్లు!
ఎగిరే ప్రతి గాలిపటం వెనుక..
ఒక చెమట చుక్క కథ ఉంది
ఒక ఆకలి కేకల నిశ్శబ్దం ఉంది.
అందుకే చెబుతున్నా..
ఎగరడం అంటే పడిపోవడానికి సిద్ధపడటం కాదు,
పడిపోయినా.. మళ్ళీ గాలిని ఒడిసి పట్టుకుని
ఆకాశపు అంచులని తాకడం!
ఇది గాలిపటం కథ కాదు..
అణిచివేయబడిన ప్రతి గుండె ఎగరేస్తున్న ధిక్కారపు జెండా!
Bureddy blooms.

No comments:

Post a Comment