*మౌన ఫలం*
మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటం కాదు. వాక్కు, మనసు, ఇంద్రియాలపై నియంత్రణ సాధించడం. రమణమహర్షి చెప్పినట్లు మౌనం ఒక నిశ్శబ్ద సంభాషణ, అత్యంత సమర్థవంతమైన భాష.
వాక్ మౌనం అంటే వ్యర్థమైన మాటలను నియంత్రించడం. ఇంద్రియ మౌనం అంటే పంచేంద్రియాల ద్వారా కలిగే కోరికలను అదుపులో ఉంచుకోవడం. మానసిక మౌనం అంటే మనసులో కలిగే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోశాలు, వాంఛలను నిరోధించడం. మనసును దైవచింతనపై ఉంచి, పరిపూర్ణ నిశ్చల స్థితికి చేరుకోవడం. నిజానికి మౌనం ద్వారా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. జ్ఞానోదయం కలిగి ఆరోగ్యం, ప్రశాంతత, సంకల్పశక్తి, ఆత్మవిశ్వాసం అందివస్తాయి. మౌనం ద్వారా అంతరంగ ప్రబోధంతోపాటు అంతర్ముఖ పయనం సాధ్యమై, అంతర్యామిని దర్శించే అవకాశం లభిస్తుంది. వేదాలు, పురాణాలు మొదలైన భారతీయ ధార్మిక గ్రంథాలలో మౌనానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వేదకాలం నుంచి మౌనం తపస్సులో ముఖ్య భాగంగా ఉంది. ఇంద్రియ నిగ్రహానికి, చిత్తశుద్ధికి మార్గంగా గుర్తింపు పొందింది. రుషులు, మునులు సత్యదర్శనం కోసం, బ్రహ్మజ్ఞానం కోసం... మౌనం అవసరమని గుర్తించారు. ‘వాక్కును నిరోధించడం ద్వారానే దివ్యత్వం వైపు అడుగులు వేయగలం’ అంటారు శంకరాచార్యులు. మహర్షులు భక్తి ప్రపత్తులతో దీర్ఘకాలం మౌనవ్రతాలు ఆచరించడం ద్వారా గొప్ప శక్తులను, జ్ఞానాన్ని పొందినట్లు పురాణ గాథలలో పేర్కొన్నారు. మౌనం ద్వారా దైవసాన్నిధ్యం సాధ్యమని పురాణాలు ఘోషిస్తున్నాయి. దక్షిణామూర్తి మౌనం ద్వారా జ్ఞానబోధ చేశాడని చెబుతారు.
మౌనం మెదడుపై సానుకూల ప్రభావం చూపుతూ ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక స్పష్టతను, సృజనాత్మకతను పెంచుతుందని న్యూరోసైన్స్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. సాంఖ్య సిద్ధాంతం మనిషి మనసు, దాని శక్తి సామర్థ్యాలపై నమ్మకాన్ని ప్రకటిస్తుంది. మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడానికి మౌనం సాయపడుతుందని, భగవంతుడిపై మనసును లగ్నంచేసేందుకు తగిన వాతావరణాన్ని కల్పించే స్వతంత్ర తత్వశాస్త్రం మౌనమని చెబుతుంది.
రామపురం చాలా అందమైన గ్రామం. కానీ, ప్రజలమధ్య నిరంతరం కొనసాగే మాటల యుద్ధం మూలంగా ఊళ్లో ప్రశాంతత ఉండేది కాదు. అక్కడికి ఒక జ్ఞాని వచ్చి పరిస్థితి తెలుసుకుని, ‘మీరంతా ఒక నెలరోజులపాటు మౌనవ్రతం పాటించండి, అత్యవసరమైతే తప్ప మాట్లాడకండి’ అన్నాడు. ఆయన సూచనలను అందరూ అంగీకరించి, ఆచరించారు. వాగ్వివాదాలు లేకపోవడంతో ఎవరి పని వారు నిశ్శబ్దంగా చేసుకోసాగారు. అలా ప్రశాంత వాతావరణం ఏర్పడింది. మౌనం ఆలోచనలకు స్పష్టతనిస్తుంది, మనసుకు శాంతినిస్తుంది, సంబంధాలను బలపరుస్తుంది.
అంతర్గత ప్రయాణం, స్వీయ ఆవిష్కరణ, ఉన్నత స్థితికి చేరుకోవడానికి చేసే త్రివిధ తపస్సులలో మౌనం శక్తిమంతమైన సాధనమని భగవద్గీత చెబుతోంది. ముఖ్యంగా మానసిక మౌనం దైవచింతనపై ఏకాగ్రత కుదరడానికి సాయపడుతుంది. ఆ స్థితిలో మనసు బాహ్య ప్రపంచం నుంచి విడివడి, అంతర్గతమైన దైవిక అంశాలపై దృష్టి సారించగలుగుతుంది.
డాక్టర్ శ్రీదేవీ శ్రీకాంత్
❤️🦚❤️
*ఈ పది వుంటే*
మనిషి జీవితం సార్థకం కావాలంటే ఉండాల్సినవి ధనం, హోదా తదితరాలు కాదు. కానీ, దేశకాలాలకు అతీతంగా లోకమంతా జీవితం అంటే అవే అనుకుంటోంది. వాటిని సంపాదించడం కోసమే జీవితమంతా పరుగులు పెడుతున్నారు. ఆ క్రమంలో యుక్తాయుక్త విచక్షణను మర్చిపోతున్నారు. సత్యం, ధర్మం, నీతి, నడవడిక మొదలైన వాటికి సమాజంలో విలువ లేకుండా పోతోంది. సమాజం ప్రగతి సాధించినప్పుడు మానవ జీవన స్థితిగతులు మెరుగుపడాలి. సాంకేతిక అభివృద్ధితో జీవనశైలి సులభతరం కావాలి. కానీ, అందుకోసం నైతిక విలువలను పణంగా పెట్టరాదు. లోక ధర్మాలు శ్రుతి తప్పకూడదు. స్వార్థంతో మనిషి పతనం కాకుండా ఉండాలంటే కొన్ని నియమాలను పాటించకతప్పదు.
మనిషి నిర్వాణ పథం చేరుకోవడానికి భగవాన్ బుద్ధుడు- దానం, ధ్యానం, ఉపేక్ష, ప్రజ్ఞ, క్షమ, శీలం, సహనం, సత్యం, శౌర్యం, నిరపేక్ష అని దశ పారమితలను (పరిపూర్ణతలు) ఉపదేశించాడు. ప్రతి వ్యక్తీ ఉన్నంతలో కొంత దానం చేయడం అలవరచుకుంటే కలిగే తృప్తి, ఆనందం ఎందులోనూ లభించవు. సత్ప్రవర్తన, నైతికత మనిషి వ్యక్తిత్వానికి అలంకారాలవుతాయి. శీలసంపద మనిషిని ఉన్నతీకరిస్తుంది. ప్రాపంచిక సుఖాల పట్ల ఎంత అనాసక్తత పెంచుకుంటే అంతగా కోరికలను అదుపులో పెట్టుకోవచ్చు. దానివల్ల దుఃఖం తగ్గుతుంది. క్షమించడం వల్ల మనిషి ప్రశాంతతను పొందగలడు. పగ, కక్షలతో హింస తప్ప ఏమీ సాధించలేం. అలాగే మనిషిలో శౌర్య గుణం తప్పక ఉండాలి. దీనివల్ల ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. స్వశక్తితో జీవించగలమనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
అలాగే ధ్యానం అంటే- చేసే పనిమీద ఏకాగ్రత కలిగి ఉండటం విజయానికి తొలి మెట్టు అవుతుంది. ఉత్తమ జీవన విధానానికి ప్రజ్ఞ అంటే- జ్ఞానం చాలా ముఖ్యం. అది ఉన్నప్పుడే జీవితాన్ని సరైన ఎరుకతో తీర్చిదిద్దుకోగలరు. అందుకే బుద్ధిజీవులకు అపజయం ఆమడదూరంలో ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా జీవితమన్నాక ఆటుపోట్లు తప్పవు. అటువంటి కష్ట సమయాల్లో ఓరిమి చూపాలి. సహనం లేకపోతే మనుషులను అశాంతి ఇట్టే ఆవరిస్తుంది. దృఢచిత్తంతో నిత్యం సత్యం పలికేవారి వల్ల లోకానికి మేలు జరుగుతుంది. తమ ప్రవర్తన మీద శ్రద్ధ కలిగినవారే సత్యమార్గంలో ముందుకు వెళ్లగలరు. ఎదుటివారు ఎటువంటి వారైనా మనం కొంత దయతో ప్రవర్తించాలి. చెడు చేసిన వారిపట్ల కూడా కరుణ చూపగలిగిన వారు మహోన్నతులు అవుతారు. అన్నిటికన్నా గొప్పది నిరపేక్ష. అంటే విడిచి పెట్టడం. మితిమీరిన కోరికలను, స్వార్థాన్ని, ఈర్ష్ష్య అసూయలను, కోపం, పగ, అహంకారాలను విడిచిపెట్టాలి.
ఈ దశ పారమితలను జీవితాంతం పాటించాలి. అప్పుడే జీవనగమనంలో వచ్చిపడిన వేగం తగ్గి, తానేంటో తనకు బోధపడుతుంది. మనుషుల మధ్య అనురాగం పెరిగి ద్వేషం తగ్గుతుంది. సమస్త మానవాళి మంగళకరమై వర్ధిల్లుతుంది.
డాక్టర్ బండి సత్యనారాయణ.
No comments:
Post a Comment