Sunday, 20 July 2025

 *@ ప్రవర్తనే..పరిచయపత్రం @33
          తేది:19/07/2025
"""""""""""'''''''''''''''''""""""""""""""""""""""""""

వ్యవహార శైలిలోనే మన వ్యక్తిత్వం కనిపిస్తుంది
నడతే మన
నాగరికతకు అద్దం పడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే
ప్రవర్తనే మన పరిచయ పత్రమవుతుంది. వస్త్రధారణ నుంచి
ఆహారపు అలవాట్ల వరకు, ఆతిథ్య సంస్కృతి నుంచి సభ్యత
వరకు, సంభాషణల సంస్కారాల నుంచి సభామర్యాదల
వరకు ప్రతిదీ మన స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. చూడటానికి
చిన్న విషయాల్లాగే అనిపించినా, అలోచిస్తే మెరుగైన మానవ
సంబంధాలకు అవే ప్రధాన కారణమవుతాయని అర్థమవు
తుంది. మనం ఏవి ఇస్తే, అవే మనకు తిరిగి వస్తాయన్న
సూత్రం గౌరవ మర్యాదలకు కూడా వర్తిస్తుంది.
మనం రాళ్లు
విసిరి మనసై పూలవానలు కురవాలనుకుంటే ఎలా?
సభ్యతా సంస్కారాలను... చూసైనా నేర్చుకోవాలి, చెప్పి
నప్పుడైనా మార్చుకోవాలి. మనవల్ల ఏ ఒక్కరికీ ఇబ్బంది
కలగకుండా విజ్ఞతతో మెలిగేవారే వివేకవంతులు. సంఘజీవులమైన మనం సాటి మనిషికి అసౌకర్యం కలగకుండా
నడచుకోలేనప్పుడు మన చదువులకు, హోదాలకు విలువే
లేదు. మనిషి ఎక్కడో నిర్మానుష్య వనాల్లో ఒంటరిగా
కొండపైనో జీవిస్తున్నప్పుడు సభ్యత, సంస్కారం, మర్యాద,
మన్ననలతో పనిలేదు. కానీ ఆ కొండపై మరో వ్యక్తి
వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. సామరస్యంగా
మసలుకోకపోతే ఘర్షణ తలెత్తుతుంది.
ముంబయికి చెందిన రుక్సానా ఎయిసా అనే రచయిత్రి
వ్యక్తుల నడవడికకు సంబంధించి ఏకంగా ఓపుస్తకాన్నే
రాశారు. 'ది గోల్డెన్ కోడ్' పేరిట విడుదలైన ఈ పుస్తకం
బహుళ జనాదరణను పొందింది. రుక్సానా విమానయాన
రంగంలో ఉన్నతోద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తూ, వృత్తిరీత్యా
ఎన్నో దేశాల్లో పర్యటించారు. ఆ అనుభవంతో ఆమె సభ్యసమాజంలో మనుషుల మధ్య సామరస్య సంబంధాలకు ఎంత
ప్రాధాన్యముందో ప్రస్తావించారు. తాను పరిశీలించిన అంశాలకు
అక్షరరూపమిస్తూ రుక్సానా సామాజిక సంస్కారాల తాలూకు
విలువైన విషయాలను తన పుస్తకంలో క్రోడీకరించారు. వ్యక్తి
విజయం, సామాజిక విజయంపై ఆధారపడి ఉందని చెప్పకనే
చెప్పారు. అందుకే ఆ పుస్తకం శీర్షికకు
'మాస్టరింగ్ ది ఆర్ట్ఆఫ్ సోషల్ సక్సెస్'
అన్న ట్యాగ్ లైన్నీ జోడించారు.
సకల సాంకేతిక సౌలభ్యాల మధ్య... పరుగెత్తయినా పాలే
తాగాలనుకునే పాశ్చాత్య ప్రపంచంలో, పౌరులు పొరుగువారిపై
ఎంతో శ్రద్ధ చూపుతారట. ఎదుటి వారి స్వేచ్ఛకు ఏ మాత్రం
భంగం కలగకుండా, పక్కవారి మనసెరిగి మసలుకుంటారట.
తమ అవసరాలు తీరటం కన్నా తోటివారికి అసౌకర్యం కలగ
కుండా ఉండటమే ముఖ్యమని భావిస్తారట. ఎంత మంచి
సంస్కారం! ఇలాంటి పలు అంశాలను ప్రస్తావిస్తూ రచయిత్రి
రుక్సానా భారతీయులం మనం ఇంకా ఆ విషయంలో వెనక
బడే ఉన్నామని అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మనం మారాల్సిన
అవసరాన్ని పరోక్షంగా ఎత్తిచూపిస్తారు...*

No comments:

Post a Comment