రూరల్ మార్కెటింగ్
ఇప్పుడంటే రకరకాల ఆన్లైన్ షాపింగులు, మల్టీ బ్రాండ్ షాపులు, మాల్స్ వచ్చాయి కానీ ఒకప్పుడు అవేమీ అందుబాటులో లేవు. కానీ అప్పటి అవసరాలు అప్పటివి. అవి తీర్చడానికి కొందరు ఆ బాధ్యత తమ భుజాన వేసుకునేవారు లేదా తమ తలకెత్తుకునే వారు లేదా నడుం కట్టేవారు. అంటే నిజం గానే (literal గా) ముఖ్యంగా పల్లెటూళ్ళలో.
ఎన్నో ప్రోడక్ట్స్. అన్నీ డోర్ డెలివరీలే.
పొద్దున్నే కూరలబ్బాయి కేకలతో తెల్లవారేది - " వంకాయలు,బీరకాయలు, బెండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లమోయ్ "కావడి భుజానికెత్తుకుని అరుచుకుంటూ వూళ్ళో వీధులన్నీ తెగ తిరిగేవాడు.
ఇక 10 గంటల వేళ స్నాక్ - "శొంటి బిస్కెట్, రొట్టి బిస్కెట్, రస్కుల్.." కరకరలాడుతూ రస్కులు, బిస్కట్లు, పిల్లల కోసం పైసకు ఒకటి వచ్చే అనేక రకాల బుల్లిబుల్లి బిస్కట్లు బలేగా వుండేవి.
సీజనల్ ఫ్రూట్స్ - "అల్లనేరేడు పళ్ళు, సీతాఫలాలు, రేగు పళ్ళు, మామిడి పళ్ళు, ఈత పళ్ళు.." ఒకటేమిటి అన్నీ రకాలూనూ. రేగుపళ్ళు, ఈత పళ్ళులాంటివి సరికి సరి - బియ్యానికి. అంటే సోలెడు బియ్యం ఇస్తే సోలెడు పళ్ళు అన్న మాట (పాపం ఒక ధనవంతుల అమాయకపు పిల్ల సరికిసరి అంటే ముత్యాలకేమో అనుకుని సోలెడు ముత్యాలు ఇచ్చి సోలెడు రేగుపళ్ళు కొనుక్కున్నదట)
ఇక మధ్యాహ్నం నుంచీ ఇంట్లో అందరూ ఖాళీయే కదా. ఏదో ఒకటి అమ్మకానికి వస్తూనే వుండేవి.
"అమ్మాయ్ ఇండుపుకాయ్ , కరక్కాయ్, కుంకం, సూదులోయ్.." అంటూ ఒక ఆమె నడుముకి ఏడెనిమిది నెలల పిల్లాణ్ణి కట్టుకుని తలమీద ఒక వెదురు బుట్ట పెట్టుకుని అరుస్తూ తిరిగేది. ఊళ్ళో నీళ్ళు మట్టిగా వుండడంతో మట్టిని వేరు చేయడానికి ఇండుపుకాయ వాడతారు. ఆమె అమ్మే ఆ నాలుగు వస్తువులకీ సంబంధం ఏమిటో ఇప్పటికీ అర్ధం కాలేదు.
"గోనెసంచులు కొంటాం గోనె సంచులు, పిండి సంచులు కొంటాం పిండి సంచులు .. " రైతుల దగ్గరున్న ఎరువుల బస్తాల సంచుల కోసం.
"పాత సామాన్లు కొంటాం .. పాత సామాన్లు .. శనాపప్పుకి సామాన్లు కొంటాం " . అంటే స్క్రాప్ డీలర్ అన్న మాట. అయితే ఆ శెనగ పప్పుకి అమ్మడం ఏమిటో అర్ధం కాదు.
"ఉప్పాడ, ధర్మవరం చీరలు, దుప్పట్లు, తువ్వాళ్ళు .." అన్ని రకాల బట్టలూ, మూట కట్టుకుని నెత్తిపై పెట్టుకుని వూరంతా తిరుగుతూ, పిలిచిన వాళ్ళ దగ్గర మూట అంతా విప్పి చూపించి, బేరం కుదరక పోతే మళ్లీ అంతా సర్దుకుని నెత్తికెత్తుకుని తిరుగుతూ అమ్మాలి.
"జీళ్లండీ.. జీళ్ళు.. " పిల్లలున్న ఇంట్లో బయట ఈ అరుపు వినగానే పిల్లలు తల్లులని పట్టుకుని కొనేదాకా జీళ్ల పాకంలా వేళ్లాడేవారు.
"ఐస్ ఐస్ .. కొబ్బరాయిస్.. పాలయిస్ .." దీని గురించి ఎంత రాసినా తక్కువే. అందరికీ ప్రీతిపాత్రం.
ఇవన్నీ ప్రోడక్ట్స్ అనుకుంటే మరి సర్వీసెస్ కూడా ఉన్నాయి :
"మాట్లేస్తాం.. మాట్లు.. " చిల్లు పడిన గిన్నెలకి, బిందెలకీ రిపేర్.
"నూతులకి పూడిక తీస్తాం ..", "నూతిలో పడిన వస్తువులు తీస్తాం.." నుయ్యి అంటే ఏమిటో ఇప్పటి వాళ్ళకి చెప్పాలి.
"బొంతలు కుడతాం బొంతలు"
"దూదేకుతామ్ .. పరుపులు కుడతాం.."
"నులక మంచాలు నేస్తాం.. నవారు మంచాలు నేస్తాం.."
"సోది సెబుతామమ్మ సోది సెబుతాం.."
వేంకటేశ్వరస్వామి కాలం నించీ వున్న విద్య.
మొత్తం అంతా ఇవే అనుకోకండి. ఇవి కొన్ని మాత్రమే. ఇంకా చాల వుంటాయి. నాకు గుర్తు లేవంతే. దీనిని బట్టి పూర్వం పల్లెటూళ్ళలో కూడా విస్తృత మైన మార్కెటింగ్ యాక్టివిటీ వుండేదని, అప్పటి అవసరాలకి తగ్గట్టుగా అన్నీ లభ్యమయ్యేవని చెప్పవచ్చు. ఇవి అమ్మే వర్తకులు, సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ కస్టపడి తమ జీవనోపాధి వెదుక్కునే వారు.
కొస మెరుపు : ఒక పండు ముసలివాడు చేతిలో ఒక ఐస్ బాక్స్ పట్టుకుని ఐసులమ్మే వాడు. మా వూర్లో ఒక సినిమా హాలు వుండేది. అందులో ఏ సినిమా వుంటే ఆ సినిమా పేరుతో ఐసులు అమ్మే వాడు. "స్త్రీ జన్మ.. స్త్రీ జన్మ సినిమా ఐసులోయ్ " "అడివి రాముడు,
అడివి రాముడు సినిమా ఐసులోయ్" అంటూ. బహుశా ఆ సినిమా హాలువాళ్ళు ఇతనికి ఇలా ప్రచారం చేసినందుకు ఎంతో కొంత ముట్టజెప్పే వారేమో. ఒకసారి ఇలా చెప్పాడు "కార్తీక దీపం త్వరలో వత్తంది ..కార్తీక దీపం త్వరలో వత్తంది.. సినిమా ఐసులోయ్". ఈ అడ్వర్టైజ్మెంట్ ఐడియాకు జోహార్లు.
నండూరి బాలసుబ్రహ్మణ్యం
No comments:
Post a Comment