చిన్ననాటి మధుర జ్ఞాపకాలు
*ఆలూరు*కృష్ణప్రసాదు*
ఆ కాలంలో - వేసవి శలవుల్లో తాతగారింటికి (అమ్మగారి నాన్నగారు) కాకినాడ వెళ్ళినప్పుడు --------------------------------------------------------------------
మా స్వగ్రామం - బాపట్ల
గుంటూరు జిల్లా.
అమ్మ పుట్టిల్లు - కాకినాడ తూర్పు గోదావరి జిల్లా.
మా చిన్నప్పటినుండి మా పద్ధతులు గుంటూరు + తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లావి కలసి ఉండేవి.
అమ్మవైపు నేను మా తాతయ్యను (అమ్మ నాన్న), అమ్మమ్మను, అమ్మమ్మ తల్లి గారిని, అమ్మమ్మ గారి అమ్మమ్మను కూడా చూసాను. (చివరి ఇద్దరినీ బాగా చిన్నతనంలో అంటే ఐదేళ్ళ వయసులో) అయినా తాతమ్మ , తాతమ్మ తల్లి ఎలా ఉండేవారో నాకు బాగా గుర్తు.
మేము వేసవి శలవులకు మా అమ్మమ్మ ఊరు కాకినాడ వెళ్ళినప్పుడు మా తాతమ్మ ప్రతిరోజు ఉదయాన్నే అంటే షుమారు ఎనిమిది గంటలకు పిల్లలందర్నీ (అంటే అమ్మ గారి అక్కాచెల్లెళ్ళ పిల్లలు, మేనమామల పిల్లలు అందరూ వేసవి శలవులకు కాకినాడ వచ్చేవారు) షుమారు 15 మంది పిల్లలను తన చుట్టూ కూర్చో పెట్టుకుని ఒక పెద్ద కంచంలో రాత్రి మిగిలిన చద్దన్నంలో బెల్లపు ఆవకాయ కలిపి (అవును బెల్లపు ఆవకాయే. గుంటూరు జిల్లా వాళ్ళయితే ఆవకాయలో బెల్లం ఏమిటి ? మతి గాని పోయిందా ? అనే వారు) పిల్లలందరికీ ముద్దలు వేసి పెట్టేది. ఈ బెల్లపు ఆవకాయ అన్నం మా పిల్లలందరికీ చాలా చాలా ఇష్టం.
తర్వాత రాత్రి రాచిప్పలో కాచిన మిగిలిన చారును అన్నంలో కలిపి పిల్లలందరికీ ముద్దలు పెట్టేది.
ఆ బెల్లపావకాయ అన్నం రుచి, ఆ రాచిప్పలో చారు అన్నం రుచి 65 ఏళ్ళ తర్వాత కూడా నాకింకా గుర్తే.
(గుంటూరుజిల్లా వాళ్ళకు చారు, రసములాంటి పేర్లు వినపడకూడదు. మరీ ఆ రోజుల్లో అయితే ఠాగూర్ లో హీరోలా మొహం పెట్టి "ఈ సృష్టిలో నాకు నచ్చని పదం చారు అనే మాటే" అనేవారు)
మా అమ్మ మాత్రం గోదావరి జిల్లా పద్ధతి ప్రకారము మా చిన్నతనం నుండీ తన వంటలలో ప్రతిరోజూ చారుని కూడా చేర్చి మా పిల్లలందరికీ మరియు చారు అసలు అలవాటు లేని మా నాన్నకు కూడా అలవాటు చేసేసింది.
తర్వాత మా తాతమ్మ మిగిలిన అన్నంలో రాత్రి తోడు పెట్టిన మీగడ గడ్డ పెరుగుపైన తొరకతో సహా వేసి (అవును గోదావరి జిల్లావారు మీగడను తొరకనే అంటారు) మరియు ఇందాక బెల్లపావకాయ అన్నం కలిపాక పక్కన ఉంచుకున్న ముక్కల పై పెచ్చును కంచం అంచుతో తీసేసి, పెద్ద బెల్లపు ఆవకాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్రతి పెరుగన్నం ముద్దలో ఒక్కొక్క చిన్నముక్క పెట్టి పిల్లలకు పెట్టేది.
తింటున్న మాకు తియ్యటి మీగడ పెరుగన్నంలో ఊరిన కొత్త బెల్లపావకాయ మామిడి కాయ ముక్క తీపి రుచి తగులుతుంటే ఆహా ! ఏమి రుచి అనుకుంటూ ఆకాశపు అంచులదాకా వెళ్ళి పోయే వాళ్ళం.
అందరికీ చద్దన్నాలు పెట్టేసి, మూతులు చేతులు కడిగి ఆటలకు తోలేసేవాళ్ళు .
మధ్యాహ్నము ఒంటి గంట దాటాక వాళ్ళ మడి వంటలు, దేవతార్చనలు, నైవేద్యాలు అన్నీ పూర్తయ్యాక మళ్ళీ మాకు భోజనాలు పెట్టడం కోసం మమ్మల్ని వెతుక్కోవడం వాళ్ళకు చాలా కష్టమయేది.
అంతవరకూ మాకు ఆకలి వేసేది కాదు.
ఆలూరుకృష్ణప్రసాదు .
అలా మా చిన్నతనంలోని జ్ఞాపకాలు మదిలో చెరగని ముద్ర వేసుకున్నాయి.
ఆలూరు కృష్ణప్రసాదు.
ఫోటో - సేకరణ.
No comments:
Post a Comment