*భగవంతునికి రుణపడి ఉండాలి*
*జ్ఞానము రెండు విధాలు:*
1. *ప్రపంచ జ్ఞానము.*
2. *పారమార్ధిక జ్ఞానము.*
*పారమార్థిక జ్ఞానము నిత్యమైనది. ప్రపంచ జ్ఞానము అనిత్యమైనది. సరస్వతీదేవి జ్ఞానము పారమార్థికమైనది కనుక శుద్ధమైనది. స్వచ్ఛమైనది. అమలమైనది. ఈ కారణం చేత శారదాదేవి అమల కమలాధివాసిని అని స్తుతించబడింది. రెండవ వస్తువును ఆశ్రయించినది ఏదైనా అనిత్యమే. అశుద్ధమే. అశుద్ధము బాహ్యములోను, ఆంతర్యంలోను గోచరించినపుడు మనలో స్వచ్ఛత లోపిస్తుంది. మనం ధరించిన గుడ్డలు మలినమవుతాయి. మన చర్మము మట్టిచేత మలినపడుతుంది. బాహ్యంలో చరించడం వలన నోరు, ముక్కు, చెవులు అన్నీ మలినపడుతూ ఉంటాయి. ఈ మాలిన్యాన్ని అరికట్టేందుకు దేహాన్ని కప్పుకోవడమే గాక, దానిని తొలగించుకొనేందుకు స్నానాదులనాచరిస్తాము. ఏది పట్టుకున్నా, దేనిని ముట్టుకున్నా అశుద్ధమే. కనుక సూక్ష్మదృష్టితో చరిస్తూ ఉంటాము.*
*అనివార్యమైనపుడు శుద్ధికర్మను ఆచరిస్తూ ఉంటాము. ఉండకూడనిది అశుద్ధము. అలాంటిది ఉన్నదని తెలియగనే దానిని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇదంతా బాహ్యశుద్ధి. దీని విషయంలో సర్వులూ ఏకీభవిస్తారు.*
*రెండవది అంతఃశుద్ధి. ఇది ఆంతరంగిక శుభ్రత. ఇది చాలా విశిష్టమైనది. అందరికీ తేలికగా మ్రింగుడుపడనిది. ఇది మనసుకు సంబంధించింది. దీని విషయంలో జాగ్రత్తపడడం సర్వులకూ సాధ్యం కాదు. దేహమాలిన్యాన్ని శుద్ధిచేసుకొన్నట్లే, మనోమాలిన్యాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి. దేహానికి మాలిన్యం అంటినట్లు దేహానికి తెలియదు. దానిని మనసు తెలుసుకుంటుంది. కానీ తనకు మాలిన్యం అంటినట్లు మనసు గుర్తించదు. గ్రహించదు. ఇక్కడే అంతశ్శుద్ధికి అవరోధము ఏర్పడుతుంది. ఇతరుల దోషాలు గుర్తించడం అందరికీ సాధ్యమే. తమ దోషాలు గుర్తించడమే కష్టం.*
*దేహాన్ని అంటిన మలినం దేహారోగ్యాన్ని పాడుచేస్తుంది. మనసునంటుకున్న మాలిన్యం మనసు ప్రశాంతతను భగ్నం చేస్తుంది. ముందు అశుద్ధాన్ని గుర్తించాలి. ఆ తరువాతే దానిని నిర్మూలించడం జరుగుతుంది. కామక్రోధాలు, రాగద్వేషాలు, ఈర్ష్యాసూయాలు, మానావమానాలు, జయాపజయాలు, సుఖ దుఃఖాలు- ఇవన్నీ మనసును కలుషితం చేసే మాలిన్యాలే. మనశ్శాంతిని భగ్నం చేసే అవరోధాలే. వీటిని మనసు నుండి దూరం చేసినపుడే మనసు శుద్ధిపడుతుంది. మనసులో అవగాహన పెరుగుతూ ఉంటే మనసులోని అశుద్ధం కరిగిపోతూ ఉంటుంది. ఒక వ్యక్తి మనలను నిందించినపుడు, నిష్కారణంగా బాధించినప్పుడు మనకు బాధ కలుగుతుంది. ఆ బాధ విస్తృతమయ్యే కొలది ద్వేషంగా పరిణమిస్తుంది. వెంటనే క్రోధం జనిస్తుంది. దాని ఫలితంగా అకృత్యాలు సాగినా ఆశ్చర్యపడవలసిన పనిలేదు. క్రోధానికి చేతలు చేతులే గాని, చిత్తము చెవులు ఉండవు. నిందించిన వ్యక్తిలో ద్వేషం పుట్టింది. కానీ ఆ పుట్టిన ద్వేషం మనలో పెరుగుతున్నదని మనం గుర్తించము. ఆ పెరిగే ద్వేషము మనలో ఎంతగా అశాంతిని పెంచుతుందో కూడా ఊహించలేము. ఎదుటి వ్యక్తిలో ద్వేషం ఉండొచ్చు. అది అతనిలో ఉండటం వల్ల మనకు అశాంతి రాలేదు. దానిని మనం గుర్తించడం వల్ల వచ్చింది. గౌరవించి అందల మెక్కించడం వల్ల వచ్చింది. క్రోధంతో ఎదుటి వ్యక్తి మనసు మలినపడితే దానిని ద్వేషరూపంలో మనం స్వీకరించి మన మనసును మలినం చేసుకొంటున్నాము. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి. దేహానికి మలినం అంటితే వెంటనే కడిగేసుకుంటున్నాం. మనసుకు అంటిన ఈ మలినాన్ని శుద్ధి చేసుకొంటున్నామా? దేహం విషయంలో నిత్యమూ జాగరూకులమై ఉన్నాము. మాలిన్యాన్ని క్షణం ఉంచుకోవడం లేదు. మనసు విషయంలో కూడా అలాగే ఉండాలి.*
*దేహమున్నంతవరకు ఆరోగ్యాన్ని వాంఛించేవారు దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనసున్నంత వరకు ప్రశాంతతను ఆశించేవారు మనసును శుచిగా ఉంచుకోవాలి.*
*అహం శుద్ధ ఇతి జ్ఞానం శౌచ మాహు ర్మనీషిణః*
*"నేను శుద్ధుడను అనెడి జ్ఞానము శౌచమని బుధజనులు పలికారు" అన్నది ఉపనిషత్తు. రెండవ వస్తువును ఆశించడం రాగమయితే, రెండవ దానిని నిషేధించడం ద్వేషమవుతుంది. ఈ రెండూ అశుద్దాలే. అశౌచాలే. ఎదుటి వ్యక్తిలో గోచరించిన దోషం మనలో ద్వేషానికి నాంది పలికింది. ఆ వ్యక్తిలో దోషాలేనా ఉండేది? సుగుణాలు లేవా? వాటిని గుర్తించగనే ఆ వ్యక్తిపై ఇంతవరకు ఉన్న ద్వేషము అదృశ్యమై ప్రేమ పుట్టుకొస్తుంది. ప్రేమ మనసులో కదలడమే శౌచము. ద్వేషపంకాన్ని ప్రేమజలముతో కడిగేసుకోవాలి. మనసును అరిషడ్వర్గాలు ఆశ్రయించకపోతే మనసు నిర్మలంగా ఉంటుంది. ఎవరిలోనో దోషాలున్నాయని దిగులు చెందడమెందుకు? ఆవేశపడట మెందుకు? ఆ దోషాలు మనలో లేనందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. భగవతికి రుణపడి ఉండాలి. అందరూ అందరికీ ఇష్టులు కాలేరు. అందరూ అందరినీ అన్ని సమయాలలో ఆదరించ లేరు. ఇవన్నీ అభిప్రాయాలు, భావాలు. మబ్బులా కదలిపోతూ ఉంటాయి. వాటిని అలా పోనివ్వండి. మిగిలింది నిర్మలమైన, నిర్విశేషమైన ఆకాశమే కదూ! అది అంబరము. ఆశుద్ధము నెరుగనిది. మనమూ అంతే. ఉండకూడనివి ఊడిపడితే పడనీ. అవి వచ్చాయి. కనుకపోతాయి. స్వచ్ఛత ఎప్పుడూ ఉంటుంది. శౌచము సదా ప్రకాశిస్తూ ఉంటుంది. అదియే జ్ఞానము.*
*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🦚🌹🦚 🙏🕉️🙏 🦚🌹🦚
No comments:
Post a Comment